విశిష్ఠత: దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత “మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు.
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.ఈ దినం “ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.
అలాగే నవరాత్రులలో ప్రతీ దినం “సుహాసినీ పూజ” చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు. తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.
//విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం
కన్యాభిః కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖే్టి విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే//
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)