Categories
Vipra Foundation

వినాయక వ్రతకల్పం-పూజావిధానం

పూజకు కావాల్సిన సామాగ్రి :

పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

పూజా విధానం ప్రారంభం :-

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో||అపవిత్రః పవిత్రోవా

సర్వావస్థాం గతోపివా|

యస్మరేత్ పుండరీకాక్షం

సభాభ్యంతరస్శుచిః||

ఓం పుండరీకాక్ష… పుండరీకాక్ష… పుండరీకాక్షాయ నమః

(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో – ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

దీపం :-

ఓం గురుభ్యో నమః

దీపమును వెలిగించి – గంధ పుష్పాదులతో అలంకరించి – దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

దీప శ్లోకం చదువుకోవాలి…..

ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ అని చదివిన తర్వాత ఆచమనం చేయాలి.

శ్లోకం : ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

పసుపు గణపతిని పూజించాలి :-

వినాయక చవితి రోజున చేయుటకు వినాయక వ్రతము ప్రముఖ శుభకార్యం కాబట్టి ముందు పసుపుతో చేసిన గణపతి పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపల్లెములో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచవలెను.స్వామి వారు తూర్పు దిశ చూస్తున్నట్లు ఉండవలెను. కొబ్బరి నూనే లేదా ఆవునేతితో దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.

ఆచమ్య:

ఓం కేశవాయ స్వాహా – ఓం నారాయణాయ స్వాహా – ఓం మాధవాయ స్వాహా – ఓం గోవిందాయ నమ: – విష్ణతే నమ: మధుసూదనాయ నమ: – త్రివిక్రమాయ నమ: – వామనాయ నమ: – శ్రీధరాయ నమ: – హృషీకేశాయ నమ: – పద్మనాభాయ నమ: – దామోదరాయ నమ: – సంకర్షణాయ నమ: – వాసుదేవాయ నమ: – ప్రద్యుమ్నాయ నమ: – అనిరుద్ధాయ నమ: – పురుషోత్తమాయ నమ: – అధోక్ష జాయ నమ: – నారసింహాయ నమ: – అచ్యుతాయ నమ: – జనార్దనాయ నమ: – ఉపేంద్రాయ నమ: – హరమే నమ: – శ్రీ కృష్ణాయ నమ:.

భూతోచ్ఛాటనము :-

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

అంటూ శ్లోకము చదివి – అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.

అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికా పుటములను బంధించి)

ఓం భూః, ఓం భువః , ఓగ్ం సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్

ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)

శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!

వినాయక ప్రార్ధన :-

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:

లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:

ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:

షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా దపి,

విద్యారమ్బే విహహే చ ప్రవేశే నిర్గమే తథా,

సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.

అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సు రైరపి,

సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!

సంకల్పం :- అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.

ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ…… నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ….వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.

పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే ।

తదంగ కలశపూజాం కరిష్యే ॥

కలశపూజ :-

కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశానికి గంధపు బొట్లు పెట్టి, అక్షతలు అద్ది, లోపల ఒఖ పుష్పాన్ని వుంచి.. తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి.)

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాత్రుగణా: స్మృతా: !!

కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా !

ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో అథర్వణ: !

అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా: !!

ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా: !

గంగే చ యమునే చైవ గోదావరి సరసతి !

నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!

కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య.

(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోఱకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)

తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.

ప్రాణ ప్రతిష్ట : పుష్పముతో పసుపు గణపతి తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.

మం !! అసునీతే పునరస్మాసు చక్షు:

పున: ప్రాణ మిహనో ధేహి భోగమ్,

జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత

మనుమతే మృడయాన సస్తి.

అమృతం వై ప్రాణా అమృత మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.

సామిన్ సరజగన్నాథ యావత్పూజావసానకమ్ !

తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం కురు !!

ఆవాహితో భవ, స్థాపితో భవ , సుప్రసన్నో భవ , వరదో భవ, అవకుంఠితో భవ ,

స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.

ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్.

పూజా విధానమ్ : షోడశోపచార పూజ

శ్లోకం: భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !

విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!

ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !

పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ !!

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం !

భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!

శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.

శ్లోకం: అత్రా విగాచ్ఛ జగదంద్య సురరాజార్చితేశర

అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!

శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.

శ్లోకం: మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !

రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ !!

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.

శ్లోకం: గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !

గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష తైర్యుతం !

శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.

శ్లోకం: గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !

భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !

శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.

శ్లోకం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !

గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం మయా ప్రభో

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.

శ్లోకం: దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం

మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.

శ్లోకం: స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక

అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !

శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.

శ్లోకం: యా ఫలిని ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:

బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.

శ్లోకం: గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :

స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోవిస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.

శ్లోకం: రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణ తం

లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్లోకం: రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ భక్తానా

మిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్లోకం: చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !

ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ సమర్పయామి.

శ్లోకం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద

శంభుపుత్ర నమోవిస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

శ్లోకం: సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.

అథాంగ పూజా:

పుష్పాణి పూజయామి: అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి.

గణేశాయ నమ: పాదౌపూజయామి !!

ఏకదంతాయ నమ: గుల్పౌ పూజయామి !!

శూర్పకర్ణాయ నమ: జానునీ పూజయామి !!

విఘ్నరాజాయ నమ: జంఘే పూజయామి !!

అఖువాహనాయా నమ: ఊరూ పూజయామి !!

హేరంబాయ నమ: కటిం పూజయామి !!

లంబోదరాయ నమ: ఉదరం పూజయామి !!

గణనాథాయ నమ: హృదయం పూజయామి !!

స్థూలకంఠాయ నమ: కంఠం పూజయామి !!

స్కందాగ్రజాయ నమ: స్కంధౌ పూజయామి !!

పాశహస్తాయ నమ: హస్తౌ పూజయామి !!

గజవక్త్రాయ నమ: వక్త్రం పూజయామి !!

శూర్పకర్ణాయ నమ: కర్ణౌ పూజయామి !!

ఫాలచంద్రాయ నమ: లలాటం పూజయామి !!

సరేశరాయ నమ: శిర: పూజయామి !!

విఘ్నరాజాయ నమ: సరాణి అంగాని పూజయామి !!

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,

వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా :-

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

శ్రీ మహాగణాధిపతయే నమ: అష్టోత్తర శత నామ పూజామ్సమర్పయామి.

శ్లోకం: దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి. (అగరోత్తులు వెలిగించి దూపము చూపించాలి)

శ్లోకం: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం శ్రీ మహాగణాధిపతయే నమ: దీపందర్శయామి. (దీపానికి నమస్కరించవలెను).

ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పయామి.

శ్లోకం: సుగంధా సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।

మహాగణాధిపతయే నమ: నైవేద్యం సమర్పయామి.

నైవేద్యం:- బెల్లము వండిన ప్రసాదం మీద నీరు చల్లి చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.

ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి.

ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.)

మధ్య మధ్య పానీయం సమర్పయామి.

శ్లోకం: సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

మహాగణాధిపతయే నమ: సువర్ణపుష్పం సమర్పయామి.

శ్లోకం: పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి।

శ్లోకం: ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ।

ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి (కర్పూరం వెలిగించి గంట మ్రోగించాలి)

అథ దూర్వాయుగ్మ పూజా :

వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా ” మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా ” అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు.

“వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్ నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై: “

శ్లోకం: యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.మనస్పూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోవాలి.

పూజ చేసిన అక్షితలను, పుష్పములు శిరస్సున ధరించవలెను.

నమస్కారము, ప్రార్థన :-

శ్లోకం: ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన, పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మ వినాయకాయ నమః నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్ వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

శ్రీ వినాయక వ్రత కథ :-

గణపతి జననము: సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో “ఏమి కావలయునో కోరుకో” అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి “ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది” అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు.

గణపతిని ముందు పూజించాలి: గణేశుడు అగ్రపూజనీయుడు

ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। “మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం : గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.

శ్యమంతమణోపాఖ్యానము : చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది. అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు… సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.

ఉద్వాసన : యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ|| పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.

విఘ్నేశ్వర చవితి పద్యములు :- ప్రార్థన

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని

తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా

దలచెదనే హేరంబుని

దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు

చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌

నిటలాక్షు నగ్రసుతునకు

బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము :-

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు

కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు – జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి – జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు

సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు – జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు

బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు – జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను

పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను – జయమంగళం నిత్య శుభమంగళం.

సర్వేజనాః సుఖినో భవంతు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)