భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం, వర్షఋతువులో రెండో మాసం. చంద్రమాన రీత్యా ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది. ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి.
శుద్ధ తదియ : వరాహ జయంతి మరియు హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతం
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ‘దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. ఈ అవతారం ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ తదియగా “వరాహ జయంతి”గా పిలువబడుచున్నవి.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు : హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతంని కూడా ఈ రోజునే జరుపుకొంటారు
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ‘హరితాళిక వ్రతం’ లేదా ‘సువర్ణ గౌరీ వ్రతం’ ‘పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.
శుక్ల చవితి : వినాయక చవితి
భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి’ లేదా ‘గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల పంచమి : ఋషి పంచమి
భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భావిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది, బ్రహ్మహణుడికి అరటి పళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచాదారలతో తయారైనదవకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.
బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన, పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.
శుక్ల షష్ఠి : షష్ఠి /సూర్య షష్ఠి
భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి, సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం, ఈరోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.
భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దంగా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ, ఋషి, పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.
శుక్ల అష్టమి : రాధాష్టమి
భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. సకల లోక జగజ్జనని రాధాదేవి అవతార సందర్భాన్ని స్మరించుకుంటూ, ఆమె మహత్వాన్ని ధ్యానిస్తూ ఈ పండుగను చేసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడి అర్ధాంగి రాధాదేవి అని, ఆమె శ్రీకృష్ణుడి కంటే భిన్నమైంది కాదని బ్రహ్మవైవర్త పురాణం నలభై ఎనిమిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ‘పరివర్తన ఏకాదశి’ అని, ‘విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ‘పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.
శుక్ల ద్వాదశి : వామన జయంతి
భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది. దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ‘అనంత చతుర్దశి వ్రతం’ లేదా ‘అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
శుక్ల పూర్ణిమ : ఉమామహేశ్వర వ్రతం
భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు, భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
మహాలయ పక్షం ప్రారంభం :
భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ‘మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.
బహుళ విదియ : బృహత్యుమావ్రతం (ఉమా మహేశ్వర వ్రతం)
బహుళ తదియ: ఉండ్రాళ్ళ తదియ (తద్దె)
భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ, ముఖ్యం గా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి, ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలక అయిదవతనం వృద్ది చెందుతుంది.
బహుళ ఏకాదశి : అజ ఏకాదశి
అజ ఏకాదశికే ‘ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం. ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.
బహుళ అమావాస్య : మహాలయమావాస్య
భాద్రపద కృష్ణఅమావాస్య /పోలాల అమావాస్య/మహాలయమావాస్య, ఈ రోజున పితృ తర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. ఈ రోజున స్త్రీలు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యం గా సంతానం కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
బతుకమ్మ వేడుకలు ప్రారంభం (పెత్రమావాస్య)
బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య ‘ఎంగిలిపూవు బతుకమ్మ’గా పెత్రమావాస్య రోజు పెద్దవిగా బతుకమ్మలను పేర్చి, సంబరం చేసుకుంటూ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పిలుచుకుంటూ ఆనాటి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకలు కొనసాగిస్తారు. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, తీరుతీరు పూలతో, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)