దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారం వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి.
పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః | పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||
ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.
ఆ కథ ఏమిటంటే…? పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.
ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో “దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని” పలికి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.
అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై… వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా..”వామనుడు మూడు పాదముల భూమి”ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెబుతున్నాయి.
వామన నోము విధానం :-
కథ : ఒకానొక రాజుకు ‘‘అమృతవల్లి” అనే అందమైన కూతరు వుండేది. ఆనాటి యువరాణులలోని అందాచందాలలో ఆమెకు ఆమె సాటి. దీంతో కేవలం అలనాటి రాజకుమారులే కాకుండా… వివాహితులైన ఎందరో రాజులు ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆశించేవారు. దీంతో ఇతర రాజకుమార్తెలు అమృతవల్లిపై ఈర్ష్య పెంచుకున్నారు. ప్రతిఒక్కరాజు ఆమెవైపే మొగ్గుచూపడంతో.. ఎవరు వీరిని వివాహం చేసుకోరు అనే భంగిమలో పడిపోయారు.
దీంతో వీరంతా ‘తంబళ’ అనే మంత్రికురాలి దగ్గరకు వెళ్లి అమృతవల్లి అందాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపించారు. దాంతో తంబళ అమృతవల్లికి హాని తలపెట్టింది. అది మొదలు ఆమె అందాచందాలన్ని మాయమైపోయాయి. అలా జరిగిన ఆమెను చూసి.. రాజులందరూ ఆమె మీద పెంచుకున్న మోజును తగ్గించుకున్నారు. ఆమెను వివాహమాడేందుకు ఏ ఒక్కరాజు కూడా ముందుకు రాలేదు.
ఇదిలావుండగా…. తీర్థయాత్రలకు వెళ్లిన రాజపురోహితుడు తిరిగి వచ్చి ఈ విషయం గురించి తెలుసుకున్నాడు. తరువాత రాజు దగ్గరకు వెళ్లి… ‘‘మహారాజా! నేను కాశీలో వుండగా యువరాణిగారి విషాదగాధ గురించి తెలిసింది. అనుక్షణమే అక్కడ వున్న పండితులతో దీని గురించి చర్చించాను. రాజకుమార్తెకు జరిగినటువంటి సంఘటనలుగాని, కోపాలు, శాపాలు వంటివి వామన నోము చేయడం ద్వారా తొలగిపోతాయని వారు చెప్పారు. తొందరగా యువరాణి ద్వారా వామన నోమును పట్టించండి” అని చెప్పాడు. ఇలా నోమును నిర్వహించిన పదిరోజులకల్లా అమృతవల్లి తన అందాన్ని, ఆరోగ్యాన్ని తిరిగి పొందింది.
ఈ నోము ప్రతిఏటా భాద్రపద మాసంనాడు నిర్వహించుకుంటారు. ఆరోజు పైన చెప్పకున్న కథను ఒకసారి చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. ఈ భాద్రపద మాసంలో శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం వుండాలి. ఇలా ఉపవాసం వుండడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తారు. శుద్ధ ద్వాదశి శ్రవణా నక్షత్ర ఘడియలలో, గాలీ వెలుతురూ బాగా వీచి, మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశంలో ఈ పూజను నిర్వహించుకోవాలి.
గడ్డకట్టి, కదలకుండా వుండే పెరుగును ఒక పాత్రలో తీసుకోవాలి. పాత్ర మీద వామనుడి స్వర్ణ ప్రతిమ ఉంచి, ఒక చేత్తో పెరుగన్నం గిన్నె, మరొక చేత్తో అమృత కలశం ధరించి వున్నట్లుగా భావిస్తూ యధాశక్తి పూజించి దద్దోజనం నివేదించాలి. ఇలా పూజ కార్యక్రమాలు పూర్తయిన తరువాత ప్రసాదాన్ని 12 మంది పేదవారికి కడుపునిండా పెట్టి, ఆ తరువాత తాము తినాలి. ఈ విధంగా ఈ పూజను 12 సంవత్సరాల వరకు చేయాలి.
ఉద్యాపనం : 12వ సంవత్సరంలో ఈ నోము నిర్వహించుకునేటప్పుడు 12 పెరుగు పాత్రలు, 12 వామన విగ్రహాలు, 12 దద్దోజన పాత్రలు దానమివ్వడం సంప్రదాయం.
బాల్యం నుంచి ఈ నోమును నోచుకుంటే.. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి రోగాలు సోకవు. గాలీధూళీ సోకవు. ఈ నోము నిర్వహించిన తరువాత కూడా ఎటువంటి ఆపదలు ఏమైనా సంభవిస్తే.. మళ్లీ ఇంకొకసారి ఈ నోమును రెండుసంవత్సరాలవరకు నిర్వహించుకుంటే అంతా శుభమే జరుగుతుంది. భక్తిగా ఆచరిస్తే గొప్ప ఫలితం ఉంటుంది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)