రాధాకృష్ణ తత్త్వం : భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమి అని అంటారు. సకల లోక జగజ్జనని రాధాదేవి అవతార సందర్భాన్ని స్మరించుకుంటూ, ఆమె మహత్వాన్ని ధ్యానిస్తూ ఈ పండుగను చేసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడి అర్ధాంగి రాధాదేవి అని, ఆమె శ్రీకృష్ణుడి కంటే భిన్నమైంది కాదని బ్రహ్మవైవర్త పురాణం నలభై ఎనిమిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ అధ్యాయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా రాధ చరిత్రను వివరించాడు. రాధ తనకు ఇష్టదైవమైన శ్రీకృష్ణుడి భార్యేనని పార్వతికి వివరించాడు పరమేశ్వరుడు. పూర్వం బృందావనంలో ఉన్న రాసమండలంలో శతశృంగ పర్వతం మీద రత్న సింహాసనంపై శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నప్పుడు జగత్తుకంతటికీ శ్రేయస్సును కలిగించే ఓ విచిత్రం జరిగింది. స్వేచ్ఛామయుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎందుకో తాను ఆడుకోవాలనే కోరిక కలిగింది. ఆయన సంకల్పాన్ని అనుసరించి ఆ మరుక్షణంలోనే ఆయనే రెండు రూపాలుగా మారాడు. ఆ రూపాలలో కుడివైపు ఉన్నది శ్రీకృష్ణుడిగానూ, ఎడమవైపు ఉన్నది రాధాదేవిగాను రూపు దాల్చాయి. రాధాదేవి రూపం అమూల్య రత్నాభరణాలను ధరించి ఉంది. బంగారు వన్నెగల వస్త్రాలను ధరించి ఓ అద్భుతమైన రత్నసింహాసనం మీద కూర్చొని ఉంది. ఆమె శరీర కాంతి బంగారు వర్ణంలోనే ఉంది. చక్కని పలువరుస కలిగి చిరునవ్వుతో ఆమె కనిపించింది. శరత్కాలంలోని పద్మం వంటి ముఖంతో మాలతీ పుష్పమాల చుట్టి ఉన్న కొప్పుతో, సూర్యతేజస్సు వంటి తేజస్సు కలిగిన రత్నాల మాలను, గంగానది ధారలాంటి ముత్యాలను ధరించి ఆమె ఎంతో అందంగా కనిపించింది. నవయౌవనంతో ఉన్న ఆ మాతను చూడగానే శ్రీకృష్ణుడు ఎంతో ఆనందించాడు. కృష్ణుడి ఆనందాన్ని చూసి రాధాదేవి తన అందాన్ని మరింతగా ఇనుమడింపజేసింది. ఆ ఇద్దరూ పరస్పరం ఎంతో అనురాగాన్ని ప్రదర్శించుకున్నారు. ఇద్దరి మధ్యా అన్ని విషయాల్లోనూ సమానత్వం కనిపించింది. ఆ రాసమండలంలోని మాలతి, మల్లికా నికుంజంలో శ్రీకృష్ణుడు రాధాదేవితో క్రీడించడమే కాక నిత్యం ఆమెను స్మరించడం, ఆమె నామాన్నే జపిస్తూ ఉండటం చేశాడు. రాధ అనే పేరే ముక్తి పథానికి సోపానం లాంటిదని కృష్ణుడే స్వయంగా అన్నాడు. రా అనే అక్షరాన్ని పలికిన భక్తుడు అత్యంత దుర్లభమైన ముక్తిని పొందుతాడు. రాధ అనే అక్షరాన్ని పలకగానే శ్రీహరి నివసించే వైకుంఠ ధామానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా నేరుగా వెళ్లిపోతాడు. ఆ కారణంతోనే రాధ నామ జపానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అలా రాధాకృష్ణుల రాసమండలంలో మనోహరంగా విహరిస్తున్నప్పుడే విశ్వ సృష్టి విస్తరించింది. శ్రీకృష్ణుడి వామపార్శ్వం నుంచి రాసేశ్వరి అయిన రాధాదేవి ఆవిర్భవించగానే ఆమె అంశ వల్ల, అంశాంశల వల్ల దేవతా స్త్రీలంతా ఆవిర్భవించారు. ఆమె నుంచే సర్వ గోపికా సంఘం ఉత్పన్నమైంది. శ్రీకృష్ణుడి నుంచి సమస్త గోపజనం ఆవిర్భవించారు. రాధాదేవి ఎడమ పార్శ్వం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ మహాలక్ష్మి జగత్తు అంతటికీ అధిష్ఠాన దేవతగా, గృహలక్ష్మిగా పిలుపులందుకుంది. వైకుంఠనాథుడు, చతుర్భుజుడు అయిన నారాయణుడికి ఆ మహాలక్ష్మి భార్య అయింది. ఆమె అంశ స్వరూపమే రాజ్యలక్ష్మి. ఆ దేవి రాజులకు రాజసంపదను ఇస్తూ ఉంటుంది. రాజ్యలక్ష్మి అంశ స్వరూపమే మర్త్యలక్ష్మి. ఆ దేవి భూలోకంలో అందరి ఇళ్లల్లోనూ దీపాధిష్ఠాన దేవతగా అయింది. అలా సర్వదేవతా స్త్రీలకు మూలకారణమైన ఆ రాధాదేవి శ్రీకృష్ణుడి వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఆ పరమాత్మ ప్రాణాలకు అధిష్ఠాన దేవత. సృష్టిలోని చరాచరాలన్నిటికీ రాధాకాంతుడైన ఆ పరమాత్మే పతి. ఆయనకు ఇష్టసఖి రాధ. రాధాదేవి కృష్ణుడికి తన ప్రాణాలకంటే ప్రియమైనది, విష్ణువుకు మాత కూడా ఆమే. ఆమెనే మూల ప్రకృతి అని అంటారు. సత్పురుషులకు తప్ప బ్రహ్మాది దేవతలకు సయితం ఆ రాధాదేవి దర్శనం సులభంగా లభించదు. శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో పలు చోట్ల రాధకూ, తనకూ భేదం లేదని, రాధను విడిచి తనను మాత్రమే పూజించినందువల్ల ఫలితం ఉండదని స్పష్టంగా చెప్పాడు. రాధాకృష్ణుల ప్రేమ తత్త్వాన్ని అందరూ అనుసరిస్తూ వారిని పూజించడమే ఉచితమైందని పరమేశ్వరుడు పార్వతికి రాధ ఆవిర్భావాన్నీ, ఆమె గొప్పతనాన్నీ గురించి వివరించాడు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)