భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్ది అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్లతద్ది స్త్రీల పండుగ. స్త్రీలలోనూ కన్నెల, పడుచుల పండుగ. మగ పిల్లలు చిన్నవారు కూడా ఇందులో పాల్గొంటారు. తలంటు స్నానం అయిన తర్వాత చేతివేళ్లకు కాలివేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారు జామున గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసును, గట్టి పెరుగుతో భోజనం చేసి తాంబూలం వేసుకుని, ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం వాటితో కాలక్షేపం చేస్తారు. గోరింట ఈ పర్వ కలాపంలో ప్రవేశం పొందింది. ఆషాఢమాసంలో ఏదో ఒక రోజున, ఉండ్రాళ్ల తద్దికి, అట్టతద్దికి గోరింటాకు పెట్టుకోవడం మనలో ఒక ఆచారంగా ఉంటూ ఉంది. గోరింట ఆకును బాగా నూరి ఆడపిల్లలు, స్త్రీలు చేతి గోళ్లకు, పారాణిగా పాదాలకు పెట్టుకుంటారు. గోరింటాకు సంస్కృతంలో నఖరంజని అని పేరు. రంగును కలిగించేది అని అర్థం. ఈ గోరింటాకు గురించి స్త్రీలకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. స్త్రీలు అరికాళ్లలో గోరింటాకు నూరిన ముద్దతో చుక్కపెట్టుకుంటారు. అది బాగా పట్టినట్లయితే ఆ స్త్రీకి తరగని అయిదవతనం. గోరింటాకు బాగా పండితే ఆ పడుచును భర్త బాగా ప్రేమిస్తాడు. ‘ప్రేమ కలవారి కంటు గోరింట’ అనే నానుడి.
గోరింట మంచి మూలిక. దాని ఆకులు, పట్ట, పూవులు, గింజలు ఓషధీగుణం కలవి. గోరింటలో ఒకవిధమైన చిరువిషం కలదు. హన్నొటాన్నిక్ ఆసిడ్ కలదు. పూవులతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు. గింజలో చమురు ఉంది.
ఉండ్రాళ్ల తద్ది
ఉండ్రాళ్లు తైల పక్వము కాక కేవలం ఆవిరి మీద ఉడికే పిండివంట. భాద్రపద మాసంలో వచ్చే మూడు పండుగలకు ప్రత్యేకం ఉండ్రాళ్లే నివేదన వస్తువులుగా ఉండడం మనం గమనించాలి. శివుణ్ణి పతిగా కోరి పార్వతి సాగించిన తపస్సుకు మోదితుడై శివుడు ప్రత్యక్షమైన రోజు అని ధర్మసింధువు. తెలుగు వారికి ఇది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది. పదహారు బిళ్ల కుడుములు వండి పూజ చేసి నైవేద్యం పెట్టడం అప్పటి ఆచారం. ఇప్పటికీ అనుకరణలో వ్రత నిష్ఠ విధానాలు చెప్పే షోడశోమా వ్రతం తెలుగులో ఈ పేరు కూర్చుకున్నది. రాజస్తాన్, మహారాష్ట్ర, మాళవ, ఉత్కళ దేశాల్లో ఆ రోజు నైవేద్యం ఆవిరి కుడుములే.
ఉండ్రాళ్లు ఆవిరి కుడుములు సేవించడం ఆరోగ్య దృష్ట్యా వరణీయమన్నమాట. ఉండ్రాళ్లను సంస్కృతంలో మోదకాలు అంటారు. వరి బియ్యపు పిండిని ముందు నీళ్లలో ఉడికిస్తారు. ఈ ఉడికే పిండిలో కొద్దిగా బొబ్బర్లు కాని, శనగ పప్పుకాని వేయం కూడా కద్దు. ఉడికిన ఈ పిండిని ముద్దలుగా చేసి నీటి ఆవిరి మీద గుడ్డ కట్టి కాని ఎండు గడ్డిగాని చుట్టి కాని ఇడ్లీల మాదిరిగా వండుతారు.
మేహశాంతిని చేయడంలో ఈ పిండి వంట పెట్టింది పేరు. బలకరమైనదే అయినా దీని వద్ద గురుత్వం చేసే గుణం కూడా ఉంది. కాబట్టి విస్తరించి వాడకూడదు. వరి పిండితో మినపపిండి కూడా మిళాపు చేసి ఇడ్లీలు, పొట్టింకులు మొదలైనవి చేస్తారు. అవి ఉండ్రాళ్ల భిన్న స్వరూపాలు అనుకోవచ్చు. ఉండ్రాళ్లను పాలలో నానవేస్తే పాల ఉండ్రాళ్లు, అవుతాయి. పాల ఉండ్రాళ్లు వీర్యపుష్టిని ఇస్తాయి. భోగినాడు తలంటు, గోరింటాకు పెట్టుకొనుట, మరునాడు తెల్లవారు జామున ఆడుకోవడం, పగలు పుష్పాచయము, పత్రాపచయము కోసం తోటల వెంట తిరుగుట ఊయల ఊగుట విహార విధులను ఈ పండుగ రోజున చేసే కార్యక్రమాలు. ఉండ్రాళ్ల తద్దినాడు ఉండ్రాళ్లు పగలు పూజ అయ్యాక తినేవి. ఈ రోజు తెల్లవారు జామున తినే పదార్థాలు కొన్ని అనుచానంగా వస్తూ ఉన్నది.
వెల్లుల్లి వేసిన గోంగూర పచ్చడి, నీరుల్లి పాయల పులుసు, నువ్వుల పొడి, పెరుగు అన్నంతో భోజనం చేయాలి. ఆ మీద అవి అరిగేటట్లు ఆడుకోవాలి. ఇక ఈ పండుగ సందర్భంలో తినే గోంగూర, నువ్వులు, ఉల్లిపాయ ఓషధీగుణాలు కూడా తెలుసుకోతగ్గవే. ఇక ఊయల ఊగడం మనోల్లాసకరమైన క్రీడలలో ఊయల ఊగడం ఒకటి. ప్రతివారి పసితనం అయిదారు మాసాల వరకు విశేషకాలం ఊయలలోనే గడుస్తుంది. అది వాతహరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాగా పెద్దవారు
కూడా అప్పుడప్పుడు ఊయల ఊగడం మంచింది. ఊయల ఊగడం ఉల్లాసంగా ఉత్సాహంగా వుంటుంది.
ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు. ఉండ్రాళ్లు వండుతారు. దేవికి అవి నైవేద్యం పెడతారు. భోజనంతో పాటు వానిని తింటారు. పిండివంటల్ని పట్టి ఏర్పడ్డ పండుగలలో ఇది ఒకటి. భాద్రపదశుద్ధ చవితి వినాయక చవితినాటి పిండివంట కూడా ఉండ్రాళ్లు. వినాయక చవితి వెళ్లిన పదిహేను రోజులకే ఉండ్రాళ్ల తద్ది. ఉండ్రాళ్లు ఆవిరి కుడుముల సేవనం ఈ కాలపు ఆరోగ్యానికి మంచిది. అజీర్ణం చేయకుండా బలాన్ని కలిగిస్తాయి. మేహ, పైత్య సంబంధరోగాలను ఉండ్రాళ్లు పొట్టెంకలు, జిల్లేడు కాయలు శమింపజేసాయి. ఉండ్రాళ్ల తదియ వ్రత చర్యలో ఐదుగురు ముత్తయిదులకు తలంటిపోసి గోరింటాకు ఇవ్వటం ముఖ్యంగా చెప్పబడింది. ఇది పొద్దుపోయే సమయాన చేస్తారు.
కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి” అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.
ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ‘‘ఉండ్రాళ్లతద్ది” అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. ‘‘నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటుచే” మని అడిగింది.
ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది.
చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న ఉండ్రాళ్లను చేసి, నైవేద్యం పెట్టింది. అయిదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంత.. ఐదేళ్లు నిర్వఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)