వివస్వత్సప్తమి, వైవస్వత మనువు జన్మదినం. ఇతనే ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరానికి అధిపతి. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి, ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడచి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత నడుస్తున్న కలియుగం లో ఉన్నాము.
వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్
తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి, తన శక్తిని ప్రసరించగలిగేవాడే వివస్వానుడు అని చెప్పబడినది.
శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక, సూర్య దేవునికి వివస్వతుడనే పేరు కూడా ఉంది. సూర్య దేవునికీ, అతని భార్య అయిన సరయు (శరణ్య) కు జన్మించిన కుమారుడే వైవస్వత మనువు. ఈ మనువుకి శ్రద్ధాదేవుడనే మరో పేరు కూడా ఉంది. ఇతనికి ఒకసారి తుమ్ము వచ్చినపుడు ముక్కు రంధ్రంనుండి వెలువడిన బిడ్డ ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకు వంశమునకు మూలపురుషుడయ్యాడు. వీరు ఆద్యులైన సూర్య వంశీకులు. ఈ వంశంలోనే శ్రీరామ చంద్రుడు జన్మించాడు.
ఆషాఢ మాసంలోని శుక్లపక్ష సప్తమిని వివస్వత్సప్తమి లేదా భాను సప్తమి గా జరుపుకుంటారు. హిందూ నమ్మకాల ప్రకారం ఈ రోజున పగటి సమయంతో , రాత్రి సమయం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానం గా ఉంటుంది. వివస్వత్సప్తమి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించటం శ్రేయస్కరం.
సప్తమి తిథి విశిష్టత
సప్తమి తిథికి అధిదేవత సూర్య భగవానుడు, ఈ రోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఏడు (సప్త) సంఖ్య కు సూర్యునికి విశేషమైన సంబంధం ఉంది. సూర్య భగవానుని జన్మ తిథి సప్తమి. అతని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక. ఒకవేళ సప్తమి ఆదివారం వస్తే దానిని మరింత విశేషమైనది గా భావిస్తారు. తిథుల్లో సప్తమి, వారాల్లో ఆదివారం సూర్యారాధన కు ప్రశస్తమైనవి.
వివస్వత్సప్తమీ:-
ఆషాఢశుక్లసప్తమీ వివస్వత్సప్తమీ| సా పూర్వవిద్ధా గ్రాహ్యా|
తథా చోక్తం భవిష్యత్పురాణే-
ద్వితీయే మాసి నైదాఘే సప్తమ్యాం శుక్లపక్షకే|
వివస్వాన్నామ రాజేంద్ర సంజజ్ఞే భాస్కరః పురా||
తస్మాత్తం పూజయేత్తత్ర ప్రసూనైర్విధైః శుభైః||
వసిష్ఠః-
షష్ఠ్యా యుతా సప్తమీ తు కర్తవ్యా తాత సర్వదా||ఇతి|
ఇయమేవ పొర్వఫల్గునీ యుతా చేన్మహాపుణ్యఫలప్రదా|
ఉక్తఞ్చ చన్ద్రికాయాం-
భగర్క్షేణ యుతా చేత్ స్యాన్మహాపుణ్యఫలప్రదా ఇతి|
ఆషాఢశుద్ధ సప్తమినాడు వివస్వత్సప్తమి అగును. దీనిని పూర్వవిద్ధగా గ్రహించవలెను. నిదాఘకాలమనగా వేసవికాలము గ్రీష్మర్తువు. అందు రెండవదైఅన ఆషాఢమాస శుక్ల సప్తమినాడు ’వివస్వాన్’ అని పేరుతో భాస్కరుని పూజించవలెను.అని భవిష్యత్పురాణము చెప్పుచున్నది.
షష్ఠితో కూడిన సప్తమి ఫల్గునీ నక్షత్రముతో కూడినచో మహాపుణ్యప్రదమని వసిష్ఠులు చెప్పిరి. చంద్రికా గ్రంథము కూడా ఈ విషయమునే చెప్పినది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)