(23 జూలై 1856 – 1 ఆగష్టు 1920 )
స్వరాజ్యం నా జన్మహక్కు – తిలక్ జాతీయ హిందూవాదం – తిలక్ కు వేదమే!
స్వరాజ్యం నా జన్మ హక్కు – దాన్ని సాధించి తీరుతాను అని శపధం పూని ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశలో ముందుకు సాగిన మహనీయుల్లో, బాల గంగాధర్ తిలక్ ని ప్రప్రధమంగా స్మరించి తీరాలి. ఈయన లోకమాన్య తిలక్ గా కూడ ప్రసిద్ధిచెందారు. భారతీయ జాతీయవాది, సామాజికవాది, స్వాతంత్ర్య సమరయోధులు అయిన తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి అధినేతల్లో ఒకరు అని చెప్పాలి. అందుకే ఆయణ్ణి ఆ రోజుల్లో భారతదేశపు ఆందోళన స్థితిని ప్రకటించిన వర్గానికి పితామహుడని, సంపూర్ణస్వరాజ్యోద్యామనికి ప్రప్రధమ నాయకుడనీ చెప్పితీరాలి. అంతే కాకుండా హిందూ జాతీయవాదానికి కూడ విత్తనాల్ని నాటిన అధినేత అనే చెప్పాలి. తిలక్ భారతదేశచరిత్రావగాహన లో నిష్ణాతుడు, సంస్కౄతపండితుడు, గణిత, ఖగోళశాస్త్రాల్లోను, హిందూత్వంలోను, ఘటికుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గరగానున్న ‘చిఖలీ గ్రామంలో 1856, జూలై, 23 న మధ్యతరగతి ‘చిత్పవణ్ సంప్రదాయ బ్రాహ్మణ మరాటి కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచి తిలక్ ది వేదాంతధోరణే. భారతదేశంలో, ఆధునికభావాలతో కాలేజీ విద్యను అభ్యసించిన మొదటితరం యువకవర్గపు ప్రతినిధిగా తిలక్ ను భావించాలి. పట్టభద్రచదువు తర్వాత, పూణేలోని ప్రైవేట్ పాఠశాలలోను, తర్వాత ఫెర్గూసన్ కాలేజీలో లెఖ్ఖల మాష్టారు ఉద్యోగం చేయడం, తర్వాత పత్రికా విలేఖరి గా ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సంస్కౄతికి, విద్యార్ధులకు అవమానకరంగాను, అగౌరవంగాను, ఉన్నందున బాహాటంగా నిరసన ప్రకటించిన ధైర్యశాలి. అంతేకాక, భారతీయ యువతకు విద్యలో విలువలను పెంచే ఉద్ద్యేశ్యంతో డక్కన్ విద్యాసంస్థను స్థాపించాడు. సంపూర్ణస్వరాజ్యం కోసం రాజకీయ పోరాటానికి నాంది మరాఠీ భాషలో దినపత్రిక కేసరి (సింహం) స్థాపించడం, స్వల్పకాలంలో బహుళాదరణ చెందడం జరిగింది. వాక్కు స్వాతంత్ర్యం పై గల అణచివేతవిధానంపై నిరసన వ్యక్తం చేయడం, ప్రత్యేకంగా 1905 లో బెంగాలీ విభజనద్వారా తగ్గుతున్న భారతీయతకు, ప్రజకు, సంస్కౄతిపట్ల చూపుతున్న నిర్లక్ష్యవైఖరిపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, భారతానికి స్వరాజ్యాన్ని అందించాలని బ్రిటిషుప్రభుత్వాన్ని నిలదీశాడు. హిందూత్వం పై తిలక్ స్వతంత్ర ఆలోచనావిధానాలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో తిలక్ 1890 ల్లో చేరినా, ఆధునిక స్వేచ్చావాదవర్గంతో సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం జరిపిన ఆలోచనావిధానాలపై అసమ్మతీయతను ప్రకటించాడు. 1891 లో ఆడపిల్లల పెళ్ళివయసుని 10 నుంచి 12 పెంచడంపై, విదేశీవిధానాన్ని అమలుచేయడంపట్ల, కాంగ్రేసు తదితర ఉదారవర్గం సమర్ధించడం, దీనికి భారతీయసంస్కౄతిలో కల్పించుకోవడం, వ్యక్తంచేసిన నిరసనతో, తిలక్ ను ఒక వితండ హిందూవివాదిగా గుర్తించడం జరిగింది. ఏమైనా, 1857 సిపాయిలకలహం తర్వాత, భారతదేశంపట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన మొదటి విప్లవాత్మక మార్పు అనిమాత్రం చెప్పాలి. హిందూమతసంస్కౄతిలో జోక్యం చేసుకున్నట్లు తిలక్ భావించడం జరిగింది. బొంబే లో ప్లేగు వ్యాధి తెచ్చిన ముప్పు బొంబాయిలో 1897 లో తాండవించిన ప్లేగు వ్యాధి, పూనాకు పాకుతుందని ఆందోళనతో ప్రభుత్వం తీసుకున్న నివారణ ప్రయత్నాలు శౄతిమించడం – వ్యాధి సోకని ప్రాంతాల్లోని కుటుంబాల్ని చెదరకొట్టడం, అనవసరంగా ఆవాసాల్ని మార్చడం, తరలింపుల్లో ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం పట్ల పెరిగిన నిర్లిప్తత, పట్టించుకోని ప్రభుత్వ పరిపాలన పై దుమారాన్ని ప్రకటిస్తూ, కేసరి పత్రికలో వివాదాస్పదమైన వ్యాసాల్ని ప్రచురించడం, శత్రువుని సంహరించడంలో భగవద్గీతలోని భావాల్ని ఉదాహరించడం ద్వారా, ఎవరినీ తప్పుపట్టకూడదని చెప్పడం, ఆ మర్నాడు 27 జూన్ న పూనా సహాయక కలెక్టర్, బౄందాన్ని సంహరించడం జరిగింది. ఈ ఘటనకు, తిలక్ ప్రచారం ఉసికొల్పిందన్న నేరానికి, 18 నెల్ల జైలు శిక్షను అనుభవించాడు. విడుదల తర్వాత, జాతీయనాయకుడిగా తిలక్ కు కొత్తగా గుర్తింపు, ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతానూ అన్న నినాదం ఈ సందర్భంగా అవతరించింది. ఈ నినాదమే, తిలక్ పేరుతోపాటు, అవిభాజ్యంగా వస్తూనేవుంది. గోఖలే తో వాదోపవాదం మరింతగా ఆధునిక భావాలున్న గోపాల కౄష్ణ గోఖలే తో తిలకు కు విబేధాలు రావడం, దీనికి ఆనాటి జాతీయ నాయకులు, బిపిన్ చంద్ర పాల్ (బెంగాల్), లాలా లజపతి రాయ్ (పంజాబ్) ల్ నుంచి సమర్ధన రావడంతో, ఈ త్రివేణీభావకూటమిని, ‘లాల్-బాల్-పాళ్ అని పిలిచెడివారు. 1907 సూరత్ కాంగ్రేసు సమావేశం, గరం దళ్ (విప్లవకారులు – త్రివేణీకూటమి), నరం దళ్ (ఆధునికకారులు గా విడిపోవడం జరిగింది. ఈ విభజనకు తిలక్, గోఖలేలు, ఆందోళనతో, జాతీయోద్యమానికి విఘాతమని భావించారు. కాని, ఫిరోజ్ షా మెహతా సన్నిహితుడైన హెచ్.ఎ.వైద్య, ఈ కూటమి కాంగ్రేస్ శరీరంలో ఒక అంగవిహీనమని, దీనికి శస్త్రచికిత్సే శరణ్యమని చెప్పాడు. 1908 ఏప్రిల్ 30 న జరిగిన ముజఫరుపూర్ లో జిల్లాజడ్జిపై బాంబుని యిద్దరు బెంగాలీయువకులు విసరడం, ప్రమాదవశాత్తు, మహిళాప్రయాణికులు మరణించడం, పోలీసుల సోదాలపై కలకత్తాలో వినాశసామగ్రి దొరకడం జరగ్గా, ఈ పూర్తి కధనాన్ని తిలక్ తన కేసరి పత్రికలో సమర్ధించడం, సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరడం పై, ప్రభుత్వం తిరిగి తిలక్ ను కష్టడీలోకి తీసుకుంది. అప్పటి యువనాయకుడు మహమ్మదు అలి జిన్నాని ప్రాతినిధ్యం వహించాలని తిలక్ కోరాడు. కాని, బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ కు బర్మాలో ఆరేళ్ళు, 1914 వరకు జైల్లో పెట్టింది. జైలునుంచి విడుదల తర్వాత, తిలక్ 1916 లో తిరిగి కాంగ్రేసు లో జాతీయవాదులతో చేరడం, అఖిలభారత హోం రూల్ ఉద్యమంలో 1918 వరకూ అనిబెసెంట్, జిన్నాలకు సహాయం చేశాడు. సర్వ మత, జాతులకి స్వరాజ్యంలో సమభాగస్వామ్యం మరాఠా రాజకీయ సిద్దాంత ప్రచారక ప్రవక్తగా ప్రారంభం కావించిన తిలక్, విభజన తదుపరి బెంగాల్ జాతీయ నాయకుల సాన్నిహిత్యంతో, ప్రముఖ జాతీయనాయకుడిగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. మరాఠా రాజకీయపాలన తరహాలో భారతీయస్వరాజ్యపరిపాలన కొనసాగుతుందా అన్న ప్రశ్నకి, 16-17 శతాబ్దాలకాలం లో నడచినా, తర్వాత మరాఠా తరహా 20 శ. లో సరితూగదని, నిజమైన ఫెడరల్ వ్యవస్థతో సంపూర్ణభారతస్వరాజ్య పరిపాలనలో, అన్ని మతాలకి, వర్గాలకి సమప్రాధాన్యత, భాగస్వామ్యం వహిస్తాయని, ఇటువంటి కూటమే భారతదేశాన్ని స్వరాజ్యంతో పరిరక్షించడం జరుగుతుందని తిలక్ నిస్సందేహంగా వివరించాడు. కర్మయోగసహిత జ్ౙానయోగం పై సమర్ధన ప్రాధమికంగా తిలక్ అద్వైత సిద్దాంతవాది అయినా, కేవలం జ్ఞానమే మానవునికి విముక్తినిస్తుంది అన్న ప్రాచీనాద్వైతవాదాన్ని త్రోసిరాజని, కర్మయోగసిద్దాంతం తో కూడిన జ్ఞానయోగం ఫలితాల్నిస్తుందని, రెండూ ఉభయతారకంగా ఆచరణకు రావాలని వక్కాణించాడు. తిలక్ ప్రతిపాదించిన సాంఘికసంస్కరణల్లో, ముఖ్యంగా – వివాహానికి కనీసవయసు, తాగుడుపై పూర్తి నిషేధంతోపాటు సరుకు దొరకకూడని పరిస్థితిని కల్పించాలన్న పట్టుదల, విద్యావిధానం, భారతీయ రాజకీయ ప్రస్థానం లో సూచించిన మార్పులు చాలా ప్రభావప్రేరణలు కలిగించాయి. హింది జాతీయభాషగా తొలి ప్రతిపాదనలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో ప్రధమ నాయకుడిగా, దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీ భాషను ఏకైక జాతీయభాషగా ప్రతిపాదిస్తూ, మొట్టమొదటి నాయకుడు తిలక్ అని చాలామందికి తెలియని విషయం. ఈ వాదననే, తర్వాత మహాత్మాగాంధి సమర్ధించాడు. అయితే, తిలక్ ఆంగ్లభాషను మాత్రం భారతీయుల మేధస్సుల్లోంచి పూర్తిగా చెరపివేయాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆచరణకు సాధ్యం కాలేదు. భారతీయపరిపాలన, సాంఘికజీవన విధానాల్లో, సమాచార, భావ ప్రకటన విధానాల్లో, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, ఆంగ్లం తిరుగులేని భాషామాధ్యమంగా తనదైన స్థానాన్ని పొందుతూనేవుంది. వసుధైకకుటుంబం భావనకు ఆంగ్లభాషామాధ్యమం అనివార్యం అన్న భావన అనేక దేశాలు ప్రపంచంలో గుర్తించాయి అన్నది నగ్నసత్యం. కాని, హిందీతో సహా భారతీయ భాషల వాడుకవిధానాలు మాత్రం తిలక్ ప్రతిపాదనల తర్వాత ఒక ఊపు, రూపు దిద్దుకున్నాయన్న విషయం కూడ నగ్నసత్యమే. సార్వజనిక, సామూహిక గణపతి పూజలు – తిలక్ భావవాహినీప్రభావమే!!! తొలుత అవిఘ్నమస్తు అని, తొండమునేకదంతమును తోరపుబొజ్జయున్ అని, శుక్లాంబరధం … ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ హైందవేతిహాసస్ఫూర్తితో భారతీయులు వారివారి పూజామందిరాల్లో ప్రతినిత్యం సుప్రభాతవేళల్లో జరుపుకునే నిత్య ఆధ్యాత్మిక తొలిప్రార్ధనలకు, ఒక సామూహికమైన, సామాజికమైన, సార్వజనికతను ప్రసాదించిన ప్రప్రధమ ప్రతిభామూర్తి, నిస్సందేహంగా, బాల గంగాధర తిలక్ మహాశయుడే. మూడురోజుల ముచ్చట నుంచి, అయిదురోజులు, గణపతి నవరాత్రులు, మాసాంతంగానూ పూజోత్సవాల్ని సామాజికంగా, సామూహికంగా, భాద్రపద శుక్ల (గణేశ) చతుర్దశిగా ప్రారంభించేవి, అనంత చతుర్దశి (ఆగష్టు/సెప్టెంబరు నెలల్లో) ఒక అనివార్య సమావేశాలకి సదవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా, నాయకులకు ప్రజలతో సంభాషణలు చేసుకోవడానికి వేదికలుగా మారాయి. శుభప్రారంభంగా, గ్వాలియర్ లో సర్దార్ ఖస్గివాలే ప్రోత్సాహంతో నిర్వహించిన పూజోత్సవాలు, సర్వోపయోగమని గ్రహించి, ఈ నూతనభావాల్ని 26 సెప్టెంబర్ 1893 లో తన కేసరి పత్రికలో సవివరంగా ప్రచురించడం జరిగింది. ఈ ఫక్కీలో, విదేశీ వస్తువుల్ని, సేవల్ని, బహిష్కరించమని చేసిన ప్రకటనలకు, పిలుపులకు, సద్స్ఫూర్తినివ్వడమే కాక, దేశీయత, దేశభక్తి, భారతీయప్రజల్లో నరనరాల్లో దూసుకుపోవడం అనూహ్య పరిణామం, పరిమాణం అని చెప్పాలి. పిదపకాలం లో తిలక్ గాంధీ నిర్వహించిన అహింస, పౌరసహాయనిరాకరణ విధానాలపై, తిలక్ నుంచి విమర్శలు వచ్చేవి. ఒకానొక కాలంలో, తిలక్ ను అతివాదకునిగా భావించబడినా, తిలక్ చర్యల్లో కొంత మెరుగుతనం కనిపించేవి. ఉభయవర్గాల మధ్య సహౄద్భావ వాతావరణంలో సంభాషణలు భారతస్వరాజ్యానికి మరింత ప్రభావితమాధ్యమాలవుతాయని తిలక్ భావించాడు. అంతేకాక, భారతీయ చరిత్ర, సంస్కౄతి, హిందూతత్వం అంశాలపై తిలక్ ప్రచురించిన రచనలు మాత్రం ఒక నూతన సంప్రదాయాన్ని, సదాచారాన్ని, భారతీయుల్లో, భారతీయ నాగరికతకు, ప్రపంచంలో గర్వించదగ్గ దేశంగా భారతీయతావిధానాలకు దోహదమయ్యాయి. వీటిమూలంగానే, గాంధీకి ఆధ్యాత్మిక, రాజకీయ గురువుగా తిలకు ను అనేకులు సమంజసంగానే భావించారు. అయితే, జాతిపిత మాత్రం, తన రాజకీయ గురువుగా, తిలక్ సమకాలీకుడైన, గోపాలకౄష్ణ గోఖలే ను, ప్రకటించారు. దీనికి విరుద్ధంగా, తిలక్ 1920 లో మరణించినప్పుడు, బోంబే లోని దహనవాటికలో, 2 లక్షలకు పైగా ప్రజాసమూహంతో నున్న గాంధి, తిలక్ కు ఘననివాళిని అర్పిస్తూ, తిలక్ ను నవభారతనిర్మాత గా గాంధి ప్రకటించడం గమనించదగ్గ విషయం. బాలగంగాధర్ తిలక్ ని మాత్రం నేటికీ నవభారత నిర్మాత గానే కాకుండా, హిందూ జాతీయతానాయకునిగా భారతావని పరిగణిస్తూనేవుంది అన్నది సత్యం. హిందూరాజకీయవాదపు అంశంగా, భారతీయ విప్లవసంస్కర్తగా వినాయక్ దామోదర్ సావార్కర్ కు ఏకైక ఆదర్శమూర్తిగా తిలక్ ని మాత్రం చెప్పుకోవాలి. తిలక్ మరపురాని సాహిత్యం బాల గంగాధరుని ప్రతిభాతిలకానికి నిదర్శనంగా, 1903 లో, ‘ఆర్కిటిక్ హోం యిన్ ది వేదాశ్ అన్న ఆంగ్లభాషారచనను ఆలోచనాత్మకంగా వ్రాయడం, ఆర్కిటిక్స్ లో వేదాల్నే రచించినట్లుగాను, ఆర్యులు దక్షిణానికి తర్వాతకాలంలో తీసుకువచ్చారని ఆయన వాదంగా తిలక్ చెప్పడం కూడ జరిగింది. ప్రముఖంగా, కర్మయోగం పై విశ్లేషణగా, భగవద్గీతను గీతారహస్యం గా, వేదోపనిషత్తులసారంగా వ్రాయడం, ఆ బౄహద్గ్రంధం నేటికీ హిందువులకు నిత్యపారాయణగ్రంధంగా ఆదరణీయంగానే భావించబడుతోంది. తిలక్ యితర రచనలను చెప్పాలంటే, హిందూ జీవనం-నైతికత-మతపరంపర, వేదసంహిత-వేదాంగజ్యోతిషాలు, యం.డి.విద్వాన్స్ సంపాదకీయంలో లోకమాన్య తిలక్ లేఖలు, రవీంద్రకుమార్ సంపాదకీయంలో గంగాధరుని పత్రరచనలు, తిలక్ పై వచ్చిన ఆరోపణల సారాంశ రచనలు ప్రముఖ ప్రభావాల్ని, ఉత్తేజితకరమైన ఆలోచనావిధానాల్ని రేకెత్తించాయన్నది నిజం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆగష్టు 1, 1920 న తన అంతిమ శ్వాసను విడిచారు. బాలగంగాధరుడి పాత్ర, ప్రభావం, ప్రేరణ, భారతీయతకు పునాది, హిందూవాదానికి వేదసంహితసమానమని నిర్ద్వందంగా భావించవచ్చు అన్న భావన, సత్యం, శివం, సుందరం. పవిత్రభావనలు అన్ని దిశలనుంచి అవతరించాలన్నది తిలక్ విషయంలో ౠజువర్తనమయింది.
లోకమాన్య బాలగంగాధర తిలక్ మహనీయుడి జయంతి సందర్భంగా సహస్ర నమోవాకాలని సమర్పిస్తోంది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)