జగన్నాధ ఆలయాన్ని శ్రీక్షేత్రం, శంఖు క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రమని పిలుస్తారు..37,000 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుత వాస్తుకట్టడం జగన్నాథుని ఆలయం.
ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నమహారాజు కట్టించాడట. ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదితీరాన ఓ కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమని అజ్ఞాపించాడట కానీ దాన్ని మలచడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వచ్చి తాను మలుస్తానని చెప్పాడట. అయితే తాను తలుపులు మూసుకుని విగ్రహాలు చెక్కే సమయంలో ఎవరు రాకుడదని షరతు విధించాడట. ఉత్సుకత ఆపుకోలేని రాజు పదిహేనోరోజున తలుపులు తెరపించడంతో అయన వాటిని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడట. దాంతో అలాగే ప్రతిష్టించారన్నది స్థలపురాణం. గోపురాలతో పెద్ద మండపాలతో దాదాపు 120 గుళ్ళు ప్రాంగణంలో ఉన్నాయి.
బలభద్ర, సుబద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటికి తీసుకు వచ్చి భక్తులకి కనువిందు చేస్తారు. ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాడ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్యశిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 ఖండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు. .
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా, పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను ‘చెరా పహారా’ అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరీ కళ్ళాపిజల్లి హారతిచ్చి ‘జై జగన్నాథా’ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్ళను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు.
ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాదుడి గుడి నుంచి మూడుమైళ్ళ దూరంలో ఉండే ‘గుండీచా’ గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటలు పడుతుంది. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమిరోజున తిరుగుప్రయాణం మొదలవుతుంది. దీన్ని ‘బహుదాయాత్ర’ అంటారు. ఆరోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి రోజున స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్నే ‘సునావేష’గా వ్యవహరిస్తారు. ద్వాదశిరోజున విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే.
పూరీ జగన్నాథ దేవాలయం (శ్రీక్షేత్రం)
జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్ధం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురమే “పూరీ”
ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.
వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.
పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీపట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలు రెండూ ఒకటిగా వుండే ఏకైక ఆలయం. అంతే కాదు మహావిష్ణు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు ఇక్కడ తన దేవేరులతో కాక, సోదరుడు బలరాముడు.. సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం.. పూరీ జగన్నాథ్ దేవాలయం.
ఒరియా సాంప్రదాయంలో జగన్నాథుడిగా కృష్ణుడు (కుడి వైపున ఉన్నది). మధ్యలో ఉన్నది సుభద్ర, ఎడమవైపున ఉన్నది బలరాముడు.
ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)