యోగిని ఏకాదశి ఏటా జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వస్తుంది. దీనికి సంబంధించిన గాథను కృష్ణభగవానుడు ధర్మరాజుకు వివరించారు. అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళుతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శాపం పెడుతాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకుఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష వుండాలని సూచించాడు. హేమమాలి భక్తితో, శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు. అందుకనే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం మనకు వున్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని కృష్ణభగవాన్ ఉపదేశంలో పేర్కొంటాడు.
చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే మాట ఆయా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అంటే ఎవరు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాళ్లు తగిన ఫలితాలను అనుభవిస్తారని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడలేక పోతుంటారు. మరికొందరు అప్పుల నుంచి … అపజయాల నుంచి బయటపడలేకపోతుంటారు. తాము నీతి నియమాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, భగవంతుడు ఎందుకు ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నాడని వాళ్లు అనుకుంటూ వుంటారు.
వాళ్లందరూ కూడా ప్రస్తుతం తాము ఎదుర్కుంటోన్న పరిస్థితులు, గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా భావించవలసి వుంటుంది. ఆ జన్మలలో చేసిన పాపాలు … అందువలన బాధకి గురైన వాళ్లు పెట్టిన శాపాల కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రహించాలి. మరి జన్మజన్మలుగా వెంటాడుతోన్న ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా? అని చాలామంది ఆవేదనకి లోనవుతుంటారు. అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా ‘యోగిని ఏకాదశి’ చెప్పబడుతోంది. ‘జ్యేష్ఠ బహుళ ఏకాదశి’ ని యోగిని ఏకాదశిగా చెబుతుంటారు. ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు .. శాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని అంటారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)