Categories
Vipra Foundation

శని మహాత్ముని జయంతి

       నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర,  కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడు.

               నవగ్రహాలలో శనిదేవునికి ప్రత్యేక స్థానం…సాధారణంగా నవగ్రహాలలో ఎవరన్నా భయపడేది శనికి. శని అంటేనే గజగజలాడతారు. కానీ ఆయనను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలిస్తే.. దుష్ప్రభావాలనుండి తప్పించుకొనుటయే కాక.. మంచి జరిగే అవకాశాలు ఎక్కువ.. అందుకే రేపటి రోజున చేయవలసిన కొన్ని పూజలు… శ్లోకములు.. ఇతర వివరములు మీకోసం..

శనీశ్వరుడి జననం (వైశాఖ బహుళ అమావాస్య)

శని దేవుని కథ ఏమిటి? వృత్తాంతమును ఇక్కడ వివరిస్తున్నాము::

నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్షదైవం సూర్యుడుభగవాను. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. వారికిరువురు సంతానం. యముడు, యమునా… వారే యమధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్ర్తీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర వుండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్క డ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాడు. తన ప్రేమాను రాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగెను. ఆటలాడుకొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయబేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా వుండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా, స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి, పట్టాభిషేకము చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుం డును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండి పోతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో వుంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం అని తండ్రి చెప్పెను. అందుకే యమునికి సమవర్తి అనే పేరుంది. (ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక). శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను.అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం వుండేట్లుగా అన్న మాట. శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడులాగా!

శని మహత్యం

       శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

       బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం-శనీశ్వరుడి జప మంత్రాలు

“నీలాంజన సమాభాసం,  రవి పుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం”

|| ఓం శం శనయేనమ:||

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:

ఓం కాకథ్వజాయ విద్మహే

ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన “నవగ్రహ పీడహర స్తోత్రం”:

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||

||ఓం శం శనైస్కర్యయే నమః||

||ఓం శం శనైశ్వరాయ నమః||

||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||

ఓం నమో శనైశ్వరా పాహిమాం,

ఓం నమో మందగమనా పాహిమాం,

ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,

ఓం నమో చాయాసుతా పాహిమాం,

ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,

ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,

ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)