Categories
Vipra Foundation

దశపాప హర దశమి – గంగావతరణం (జ్యేష్ఠశుద్ధ దశమి)

” జ్యేష్టమాసి, సితేపక్షే, దశమ్యాం, బుధ హస్తయో,| వ్యతీపాతే, గరానందే, కన్యాచంద్రే, వృషౌరవౌ|| “

        జ్యేష్ట మాసము, శుక్లపక్షం, దశమి, వ్యతీపాత యోగము, గర కరణము, బుధవారము, హస్తా నక్షత్రములున్నందు వలన ఆనంద యోగము, కన్య యందు చంద్రుడు, వృషభమందు రవి, ఇవి పదిరకాలైన కాల విశేషాలు. ఈ పదీ కలిసి వచ్చిన రోజును దశపాప హర వ్రతము చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాప హర వ్రత లక్షణములు. 

గంగావతరణ జ్యేష్ఠ శుక్ల దశమీ బుధవారం హస్తా నక్షత్రంలో అయినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది అంటున్నారు. వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణం జరిగిందని గ్రంథాంతరాల్లో ఉంది. గంగావతరణకు ఇది మరొక తిధి. ఈ రోజు గంగావతరణ అయినా కాకపోయినా ఈ పండుగ గంగానదిని ఉద్దేశించి చేయబడింది కావడం నిజం. ఈ వ్రత విధానం (దశపాపహర దశమి) స్కంధ పురాణంలో ఉంది. గంగాదేవి కృపను సంపాదించటమే ఈ పండుగ ప్రధానోద్దేశం. ఈ రోజున గంగా స్నానం చేసి పూజ చేసి గంగా స్తోత్రం పఠిస్తే దశ విధ పాపాలు తొలుగుతాయి అని వ్రతగ్రంధం.

ఈ గంగాత్మక దశమికి మరోపేరు దశపాపహార దశమి అని; దశ హర దశమి అని కూడా అంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం

శ్లోః లింగం దశాశ్వ మేధేశం

దృష్ట్యా దశహరాతి ధే

దశ జన్మార్జితైః పాపైః

త్యజ్యతే నాత్రసంశయః

దశహర తిధినాడు దశాశ్వ మేధ ఘట్టంలోని లింగము చూచినట్లయి తే లోగడ పది జన్మలలో చేసిన పాపం నిస్సందేహంగా నశిస్తుందని తాత్పర్యం.

స్నాన సంకల్పంలో కూడా ఈనాడు ‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర స ముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం దహ హర మహా పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే” జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన పది విధాలైన పాపాలు పోగొట్టే స్నానమని దీని భావం. పూజ కూడ పది పూవ్వులతో, పది రకాల పళ్ళతో నైవేద్యంగా చేస్తారు అని చెబుతారు.

గంగా దేవి పూజా మంత్రం

నమో భగవతె్యై దశపాపహరాయై

గంగాయై నారాయణై్య

రేవతె్యై దక్ష్రాయై శివాయై

అమృతాయై విశ్వరూపిణై్య

నందినై్య తేనమోనమః

ఓం నమశ్శివాయై నారాయణై్య

దశహరాయై గంగాయై నమోనమః

షోడశపచర విధిచే గంగాపూజ చేస్తూ అందులో ఈ మూల మంత్రా న్ని అహోరాత్రులు అయిదు వేలసార్లు జపించి వ్రతం పూర్తి చేయాలి.

        దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్‌; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్‌ అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!

ఇక దశవిధ పాపములు :-

1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,

2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,

3. పర స్త్రీని కలవడం – ఇవి మూడు శరీరం తో చేసేవి.

4. పరుషము, 5. అసత్యము, 6.కొండెములు, 7. అసంబద్దమైన మాటలు – ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.

8. ఇతరుల ధనములందు కోరిక,

9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,

10. వ్యర్ధమైన అహంకారము – ఇవి మూడూ మానసికంగా చేసేవి.

ఇవే పదిరకాలైన పాపాలు.

      ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.

      ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం, మనం చేసిన తప్పులూ వలన వచ్చే పాపాలూ కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలూ, మనకు ముందే చెప్పారు.

       అంటే మనం చేసే తప్పులు తప్పక చేస్తామని ముందే ఊహించి మరీ ఉపాయాలు చెప్పారు. వాటిని ఆచరించడమూ, ఆచరించకపోవడమూ మాత్రం మన చేతిలో వుంటాయి. మరి మన బుద్ధి ఎటు ప్రవర్తిస్తుందో, చేయమంటుందో, వద్దంటుందో ఆ సింగినాదం అంటూ వదిలివేస్తుందో చూడాలి, ఏది ఎలా వున్నా దశాపాపహర దశమి మాత్రం మంచి పర్వదినమే .

      శరీరానింకి అంటిన ఎలాంటి మురికైనా సరే నీరు తప్పనిసరిగా కావాలి. అలాగే పాపాలూ పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే గతి, గంగాదేవిని ఆరాధించి సేవించవలసిందే.

      మొట్టమొదటగా దేవలోకంలో దేవకృత్యాలు చేయుటకు సృష్టికర్త అయిన బ్రహ్మ చేతి కమందలమునండు మాత్రమె వుండేది. గంగ, వామనావతార సమయాన బలిచక్రవర్తి వామనస్వామికి మూడడుగుల నేలను దానం చేసే సమయాన స్వామి పాదాలు కడగటానికి ఉపయోగించిన ఆ గంగ విష్ణుపాదోదకమై ఆ తరువాత కైలాస వాసి శంభుని జటయందు చేరి ఓ అలంకరణగా మిగిలివుంది. ఆ సమయాన భగీరథ మహారాజు ప్రయత్నముతో భూమిపైకి దిగి ” భాగీరథి ” అను పేరుతొ వందల కొద్దీ యోజనముల మేర ప్రవహించుచూ మనకు కనిపిస్తూవున్నది.  

       అదే పరమపావని గంగ. లోపలి, బయటి పాపములను కడిగివేసే ఆ తల్లే సర్వ భూతములనూ రక్షిస్తూవున్నది. అలాంటి గంగమ్మ తల్లిని స్మరిస్తేనే చాలు విష్ణులోకం ప్రాప్తిస్తుందని పెద్దలూ చెప్పారు. కల్మష నాశిని, కలుష హారిణి అయిన గంగను ” ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయన్యై, రేవత్యై, శివాయై, దక్షయై, అమృతాయై, విశ్వరూపిన్యై, నందిన్యైతే నమో నమః ” అంటూ  జ్ఞాన ఐశ్యర్యాది షడ్గుణవతియు, దశవిధ పాపముల హరిన్చునదియు, నారాయణ మూర్తి పాదముల నుండి పుట్టినదియు, రేవతియు, శివయు, దక్షయు, అమ్రుతయు, విశ్వరూపిణియు, నందినియూ, అగు గంగాదేవికి నమస్కారము. అని నమస్కారం చేయడం శాస్త్రాలు చెప్పిన పధ్ధతి.  

   జీవనాధారమూ, ప్రాణాధారమూ, అయిన గంగ లేకుండా ఏదీ జరగదూ, ఉండదూ. అందుకే దశయోగ పర్వదినాన దశపాపహరయైన గంగను ఆరాధించడం ఆచారం. ఓ చిన్నప్రతి మయందు గానీ చెంబులోని తీర్ధమందు( కలశమందు గానీ ) గంగాదేవిని ఆవాహనము చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్టశుక్ల దశమి, ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యధావిధిగా స్తోత్రం చేసినవారికి అందని సౌభాగ్యాలుండవు. అష్టైశ్వర్యములూ ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది.

గంగమ్మతల్లి పన్నెండు పేర్లు :

“నందినీ నళినీ

సీతామాలినీ చ మహాపగా

విష్ణు పాదాబ్జ త్రిపధగామినీ

భాగీరథీ భోగవతీ

జాహ్నవీ త్రిదశేశ్వరీ”

       అంటూ గంగమ్మతల్లి పన్నెండు పేర్లనూ తలుస్తూ పదిమార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే  పదిమార్లుగా స్నానం చేయడం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్లనూవులు, పేలాలపిండి, బెల్లము చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలూ మూడూ విదాలైనవీ, శరీరంతో చేసిన మూడూ విధాలైన పాపాలూ, నోటి మాటతో చేసిన మూడూ రకాలైన పాపాలూ ( మొత్తం పది ) నశించిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే పది దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ. అలాగే పదిమంది బ్రాహ్మణులకు యవలు, నువ్వులు, దక్షిణ తాంబూలాలతో దానం చేయడం, గోదానం చేయలేక పోయినా చిన్న చిన్న ఆవు బొమ్మ దానం అయినా చేయాలి. మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాలవిశేషం దశపాపహర  పర్వదినం. ..

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)