సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా, శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం శంకరుడి ముఖ్య కర్తవ్యం, అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం – అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు.
ఆదిశంకరుని జీవితగాధ…
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు ‘శంకర విజయం’ అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి చరిత్రలలో కొన్ని – శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
మాధవీయ శంకర విజయం – 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన.
చిద్విలాస శంకర విజయం – 15 – 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన.
కేరళీయ శంకర విజయం – 17వ శతాబ్దికి చెందిన రచన.
జననం…
సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురువులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదేవిధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది.
శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.
బాల్యం…
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది.
దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది. ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారం…
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది.
సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారతయాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
శంకరుని అసమాన ప్రతిభ…
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్ర్కమించ బోవడం చూసి, శంకరుడు ‘‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ” మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు ‘‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది.
నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక” అని దీవిస్తాడు.
మానవులందరిని భక్తి, జ్ఞాన, కర్మల ద్వారా అద్వైత మార్గాభిముఖులుగా త్రిప్పి, మోక్షమార్గాన్ని చూపిన జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు. అటువంటి పుణ్యమూర్తి జన్మదినమున మన మంతా విశేషంగా జరుపుకుని పునీతులౌదాము.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)