మానవుడు మహోన్నతుడు కాకపోయినా ఫరావాలేదు. నీచ సంస్కృతికి వారసుడు కారాదు. సమాజం చల్లగా సాగిపోవడాని ఇక సామాన్యుడు ఎప్పుడూ అవాంతరం కాదు. అవాంతరమల్లా నీచులవలన ఆపాదిస్తుంది. కావాలని అటు రాజకీయుల నుండి ఇటు సామాన్యుల వరకు అంటూనే వుంటారు. కాని ఆ మార్గాన్ని అవలంబించేదెందరు? అందుకు బాటలు వేసేదెవరు? ఆ వేసిన బాటలు బీటలు కారకుండా కాపాడెదెవరు? ఇవే ఆనాడూ, ఈనాడూ, ఆనాడైనా మనముండు ఉండే ప్రశ్నలు. వీటికి సరైన జవాబు, పరిస్కారం లభించిన నాడు అది నిజంగా పర్వదినమే.
సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుందంటే సామాన్యునికి ఎలాంటి కష్టనష్టాలు వాటిల్లుటలేదని, వారిని ప్రగతి పధంలో నడిపించే కర్తలెవరో ఉన్నారని తెలుసుకోవచ్చును. అలాగే సామాన్యుని జీవితం దుర్భరమవుతుందంటే, దుష్టబుద్దులు పెచ్చరిల్లారని, వారిదే పైచేయ్యిగా ఉన్నదని చెప్పకనే అర్థమయ్యే విషయం. ఓ విపత్కర పరిస్థితి ఏర్పడితే దానిని సరిచేసి సమతుల్యంగా నడిపించే వారు కావాలా! రావాలి! అలా అలనాడు శ్రీరామచంద్రుడు,ఆ తర్వాత కృష్ణపరమాత్మ మొదలుగా గలవారు వచ్చారు. సరిచేశారు కోంతకాలం గడిచింది. మళ్లీ పూర్వపు అరాచకం (పద్ధతిలో మార్పే తప్ప) ప్రబలింది. మరో అవతారం రావలసి వచ్చింది. రానే వచ్చారు. శ్రీ వీరబ్రహ్మేంద్రులు. వారి చరిత్ర అందరికీ తెలిసిందే. వారు ఈ సమాజం ఎలా ఉండాలని బోధించారు! ఈ విషయాన్నే సమీక్సించుకుందాం.
ప్రతివారూ తనకు హితులు కావాలని కోరుకుంటారు. హితులంటే తనకు మేలు చేసేవారని. అలాగే తాను మరొకరికి హితుడు కావాలి! అంటే ఇతరులకు ఉపకారం చేయగలగాలి. అలాంటి భావాలు సన్నగిల్లినపుడే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది.ఏ తత్ పరిష్కారానికై మరొకరు రావలసి వస్తున్నది. జనుడు కోరలున్న సర్పమ్ము కారాదు – తోడేలవుట మంచి త్రోవ కాదు” (42) అన్నారు స్వామి. అనడమే కాదు హెచ్చరించారు కూడాను. అలా ఆనాటి పాలకులు మత మౌఢ్యంతో వ్యవహరిస్తుంటే వారి వద్దకు వెళ్ళి సంస్కరించారు. ‘మతము మత్తుగూర్చు మార్గమ్ముకారాదు. హితముగూర్పవలము వెల్లరకునూ” (964) అని చెబుతూ పాలకులు ప్రజలను కన్నబిడ్డాల్లాగా పాలించాలే కాని పిడించరాదన్నారు. మేము పండితులమని వీగుతూ కులాలపేరుతో సమాజాలను చీల్చేవారినీ విడిచిపెట్టలేదు. ‘పసిడి పలుకులెల్ల పాండిత్యము వచ్చు – కాని మానవుండు కడతేరడద్దాన” (18) అని వెలుగెత్తిచాటాడు. అందుకు ప్రతీకగా హరిజన్మ కక్కయ్యకు బ్రహ్మోపదేశం చేశాడు. “కులమనేటి తెగులు కొంపలు గూల్చును” (76) అని కుటిలత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించడన్నారు. స్వామి అన్ని కులాల వారికి బ్రహ్మ విద్యను మహమ్మదీయుడైన సిద్ధునికి బ్రహ్మత్వాన్ని ప్రసాదించి మతసామరస్వానికి బాటలు వేశాడు. “గురువులు శిష్యులెల్ల పరిపాలనాపరుల్” (695) అంటూపాలకులు పాలితులు ఆధ్యాత్మిక సమాజం దివ్యంగా భవ్యంగా సాగుతుందని బోదించారు స్వామి. “ప్రేమలేని చదువు ప్రతే భూషణమాయే” (149) అంటూ నేటి విద్యా వ్యాపార విధానాలును ఎండగట్టాడు స్వామి. కష్టజీవులపైన కరుణ చూపలేనివాడు బ్రహ్మాన్నెరుగలేడని చేప్పాడు.
అంటే నేను వేదాంతిని. జ్ఞానిని అని తనను తాను తాను అధికంగా ఊహించుకుంటూ కష్టజీవులను ఆదుకోలేనివారు పొందు పరమార్థం పొందలేరని, పరహితం కోరడంలోనే అసలైన పరమార్ధం ఉన్నదని వివరించారు. కార్యక్రమములను మెండుగా చేయమని స్వామి హితవు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అందరూ కలిసి మెలిసి జీవించే సమాజం కావాలని చెప్పారు. అనగా వాటికి సమాజంలో అలజడి, అకృత్యాలు పెచ్చుపెరగరాదని, నిగ్రహంతో సమన్వయ బుద్ధితో వ్యవహిరించాలని స్వామి హితవు చెప్పాడు. కులమైనా మతమైనా రాజకీయమైనా మరే ఇతర కారనమైనా మానవాళి జీవనవిధానంలోనికి నింపరాదు. వాటి పాటికి అవిసాగిపోవాలేకాని వికృత రూపం దాల్చరాదు. అలా దాల్చటం జరిగితే ఏ కొందరో స్వార్థ, సంకుచిత స్వభావుల పనే తప్ప వేరొకటి కాదని అలాంటి వ్యక్తిత్వాన్ని వదులుకోలేరు. భావికాలంలో అత్యధికదుష్పలితాలను అందుకోవలసినవస్తుందని చెప్పారు.
అందరూ కలిసిమెలిసి జీవించండి. ఆనందంగా ముందుకుసాగండి అన్నారు స్వామి. ఆయన ఆధాత్మిక జీవనవిధానం చక్కగా దోహదం చేస్తుంది. అది వ్యక్తిస్వర్ధాన్ని పక్కకుపెట్టి త్యాగాన్ని వృద్దిచేస్తుంది. తద్వారా పరహితం కోరగలరు. స్వహితం కొంత పక్కన పెట్టగలరు. సాధనతో ముందుకుసాగితే ఇంకా వివేకవంతులై నవ్య సమాజానికి బాటలు వేయగలరని ఉద్బోధించారు స్వామి. కనుక స్వామిచెప్పిన మార్గాన్ని అవలంబించి సమాజహితులమై శ్రేయో మార్గాన్ని అవలంబిస్తు; కావున అందరూ వైశాఖశుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన జరుపుకొనవలెను. వీలయినవారు బ్రహ్మంగారి మఠం (కందిమల్లయ్యపల్లి) దర్శించగలరు. అంతేగాక ఆర్థిక స్తోమత లేనివారు తమ తమ గృహములలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అష్టోత్తరపూజ చేసి నివేదన జేయగలరు. బ్రహ్మంగారి కళ్యాణము (కందిమల్లయ్యపల్లి) బ్రహ్మంగారి మఠము నండు మహాశివరాత్రిపర్వదినమున అత్యంత వైభవోపేతంగా జరుగును. కావున తప్పక దర్శించగలరు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)