Categories
Vipra Foundation

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి

(1872 ఆగష్టు 23 —- 1957 మే 20)

     శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23వ తేదీన అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. చిన్నతనమంతా వల్లూరు లోనూ, నాయుడుపేట లోనూ గడిపిన ప్రకాశం చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా, ధైర్యంగా ఉండేవాడు.

     ఒకసారి స్కూల్లో సూర్యనారాయణ అనే విద్యార్ధి తిరస్కారంగా మాట్లాడి ప్రకాశాన్ని కొట్టాడు. ఆ కోపం పట్టలేక అతనిని ఇంగ్లీషు పుస్తకం తీసుకొని సువర్ణముఖి ఒడ్డుదాకా పారిపోయి అక్కడ ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. ఆ విషయం హెడ్మాష్టారు గారికి తెలిసి ప్రకాశంను డిస్మిస్ చేశాడు. అప్పుడు ఆ బాల ప్రకాశం కలెక్టరు వద్దకు వెళ్ళి ధైర్యంగా ఉన్నదున్నట్లు చెప్పాడు. సూర్యనారాయణ తనకన్నా పెద్దవాడు కాబట్టి పగతీర్చుకోవటానికీ పని చేశానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. నిర్భయంగా ఉన్నదున్నట్లు చెప్పినందుకు ఆ డిప్యూటీ కలెక్టరు సంతోషించి ప్రకాశంను తిరిగి స్కూలులో చేర్చుకోవాలని ఆదేశించారు.

      ప్రకాశంకి పన్నెండు సంవత్సరాలు వచ్చే సరికి తండ్రి మరణించాడు. అసలే పేద కుటుంబం. దానికి తోడు ఇంటికి పెద్ద మరణించటంతో వారి కుటుంబానికి పెద్ద దెబ్బే తగిలింది. కొన్నాళ్ళు మేనమామ గారింట్లో ఉండి, తరువాత కుటుంబం ఒంగోలుకి తరలిపోయింది. అక్కడ ప్రకాశం తల్లి చిన్న హొటలు ప్రారంభించి కుటుంబాన్ని పోషించింది. పూటకూళ్ళమ్మలంటే చులకనగా ఆ రోజుల్లో భావించినా నలుగురికి భోజనం పెట్టి జీవించడమే గౌరవ ప్రధమని ఆ తల్లి సాహసంతో బందువులు, స్నేహితులు నివ్వెరపోయేలా చేసింది. ఏ పని చేయాలన్నా ఎదుటి వారేమనుకుంటారోనని భయపడక తన అంతరాత్మ అంగీకరిస్తే ఆ పని పూర్తి చేయాలనే అలవాటు ఆమె నుంచి ప్రకాశం పుణికిచ్చుపుకున్నాడు.

      ఒంగోలు మిషన్ స్కూలులో ఉపాధ్యాయులు శ్రీహనుమంత రావుగారు ప్రకాశంను ఎంతో అభిమానిస్తూండేవారు. అతనిలోని ధైర్యం నిజాయితీ ఆయనను ఆకట్టుకున్నాయి. ఆయన, అతని చదువు విషయంలో ఎంతో శ్రద్ద చూపి, అతనికి ఆర్ధికంగా కూడా సహాయం చేస్తుండేవారు. తన “నా జీవిత యాత్ర” పుస్తకంలో హనుమంతరావుగారి గురించి ప్రస్తావిస్తూ “ఆయన నా జీవితానికి మార్గదర్శకుడు, నా అభివృద్దికి మూల కారకుడు అని కృతజ్ఞతా పూర్వకంగా విశ్వసిస్తాను” అని రాశారు ప్రకాశం.

      హనుమంతరావు గారి ప్రోత్సాహంతో బాగా చదువుకుంటూ, తెలిసిన వాళ్ళ ఇళ్ళలో వారాలు చేస్తూ చదువు పూర్తి చేసి, ప్లీడరు వృత్తి చేపట్టాడు. అనతి కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు గడించి, తరువాత ఇంగ్లాండ్ వెళ్ళి బారిష్టరు పరీక్ష పాసయి, న్యాయవాది వృత్తిలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ముఖ్యంగా పేదవారి విషయంలో ఎంతో సహాయం చేస్తూ వారి నుంచి ఎటువంటి ఫీజును తీసుకునేవాడు కాదు.

       భారతదేశంలో తెల్లవారికి వ్యతిరేకంగా 1915లో దివ్యఙ్ఞాన సమాజం స్థాపకురాలు అనిబిసెంటు ఒక ఉద్యమం ప్రారంభించారు. భారతీయులు స్వయం పరిపాలనా అధికారం పొందాలని “హొం రూలు లీగు” ను స్థాపించిన దేశ భక్తులకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రకాశం గారు లక్షలు గడిస్తున్న తన వృత్తికి తిలోదకాలు ఇచ్చి ధైర్యంగా, ఆ ఉద్యమంలో చేరి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడిని తీసుకురాగలిగారు.

      స్వాతంత్ర్యం సమరంలో నిర్వహించిన ప్రతి ఉధ్యమాలలోనూ ప్రకాశం గారు ముఖ్య పాత్ర వహించి, మహత్మాగాంధీ వంటి పెద్దల మెప్పు పొందారు. “స్వరాజ్య” పత్రికను స్థాపించి ఎంతో ధైర్యంగా నిరంకుశ చర్యలను నిర్భయంగా వెల్లడించి, తన అచంచలమైన దేశభక్తిని చాటుకున్నారు. టంగుటూరి ప్రకాశం గారి రాజకీయ జీవితం 1906 నుండి ప్రారంభమయింది. బిపిన్ చంద్రపాల్ మద్రాసు సందర్శించినపుడు జరిగిన బహిరంగ సమావేశంలో ప్రకాశం అధ్యక్షత వహించారు. 1907 లో సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రేస్ సమావేశంలో ప్రకాశం మొదటిసారిగా హజరైనారు. తరువాత రాజమండ్రి పురపాలక సంఘాద్యక్షునిగాను, మద్రాసులో మంత్రిగానూ, ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. జాతీయోద్యమంలో పాల్గొని చాలా పర్యాయాలు అరెష్టు చేయబడ్డారు. వీరిని “ఆంధ్రకేసరి” అని పిలిచారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి ముఖ్యమంత్రి అయినారు.

      ఆయనను ఆంధ్రకేశరిగా ప్రజలు అంగీకరించడానికి అత్యంత ముఖ్యమైన సంఘటన ఒకటి వుంది. 1927లో తెల్లదొరలు సైమను నాయకత్వంలో కొందరిని భారతదేశం పంపారు. వారి వలన దేశానికి ఎటువంటి సహాయం ఉండదని మన నాయకులు అభిప్రాయపడి ఆ సైమన్ కమీషన్ ను బహిష్కరించాలని నిత్ణయించారు. ఆ కమీషను మద్రాసు వచ్చినప్పుడు, దేశభక్తులు శాంతియుతంగా పికెటింగ్ చేయటం ఆరంభించారు. అది చూసి రెచ్చిపోయిన పోలీసులు వారిపైన తుపాకి కాల్పులు మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రకాశం గుంపులోంచి ముందుకు వచ్చి తన చొక్కా చింపి ఎదురు చాతిని పోలీసులకు చూపి “ఇదిగో నేను సిద్దంగా ఉన్నాను కాల్చండి” అన్నాడు. ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పోలీసులు వెనకకు తగ్గారు. మన రాష్ట్ర అభివృద్దికి అనితర సాధ్యమైన సహాయాన్ని అందించిన ఆ మహామనిషి 1957 సంవత్సరము మే 20 వ తేదీన స్వర్గస్థులయారు.

 –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)