“ఏకాదశివ్రతం నామ సర్వకామఫలప్రదం | కర్తవ్యం సర్వదా ఏప్రైర్ విష్ణు ప్రణన కారణం ||”
చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే వరూధినీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజ సంవాదముగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది.
ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణభగవానునితో పలుకుతూ “వాసుదేవా! నీకు నమస్సులు. చైత్రమాసం. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి, దాని వామప్రభావ మహిమలను గురించి నాకు వివరించవలసినది” అని అన్నాడు.
దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు “రాజా! ఆ ఏకాదశి పేరు వరూథనీ ఏకాదశి, అది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతపాలనము ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడౌతాడు. ఆ వ్రతపాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలౌతుంది. పురుషుడు. ఇహపరాలలో సుఖసమృద్ధులు పొందుతాడు. వారు జన్మమృత్యువుల వలయం నుండి బయటపడతారు, సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి. వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు. ధుంధుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరూథినీ ఏకాదశి వ్రతపాలన మాత్రముననే మనిషి పదివేల సంవత్సరాల తపోఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రములో సూర్యగ్రహణ సమయమున నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలము ఆ వరూధినీ ఏకాదశ వ్రతపాలనము ద్వారా మనిషి సాధించగలుగుతాడు.”
“ఓ రాజోత్తమా! అశ్వదానము కన్నను గజదానము శ్రేష్ఠమైనది. భూదానము గదానము కన్నను. శ్రేష్ఠమైనది; తిలాదానము భూదానము కన్నను శ్రేష్ఠము. సువర్ణదానము తిలాదానము కన్నను, అన్నదానము సువర్ణదానము కన్నను శ్రేష్ఠములైనవి. నిజానికి అన్నదానము కంటే శ్రేష్ఠమైన దానము ఇంకొకటి లేనేలేదు. ఓ రాజశ్రేష్టుడా! అన్నదానముచే మనిషి పితృదేవతలను, దేవతలను, సకలజీవులను సంతృప్తిపరుపగలుగుతాడు. కన్యాదానము అన్నదానముతో సమానమని పండితులు చెబుతారు. అన్నదానము గోదానముతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే పోల్చి చెప్పాడు. అంతేగాక దానములు అన్నింటిలోను ఇతరులకు జ్ఞానదానము చేయుట అత్యున్నతమైన దానము.”
“వరూథినీ ఏకాదశి వ్రతపాలనముచే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కముగా ఘోరపాపాన్ని మూటగట్టుకొనినవాడై విలయానంతరము వరకు నరకములో మ్రగ్గుతాడు. కనుక ఎవ్వడును కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా! లోభముచే ఎవడేని కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కాని ఎవడైతే శక్త్యనుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్యపరిపాకాన్ని యమరాజు యొక్క ప్రధాన కార్యదర్శియైన చిత్రగుప్తుడైనా గణించలేడు. ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచుపాత్రలో భుజించరాదు, మాంసభక్షణము చేయరాదు, ఎఱ్ఱపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె, ఇతరులు వండిన దానిని, ఒకమారు కంటే ఎక్కువ గాని తినరాదు; ఏకాదశికి ముందురోజు నుండే మైథనక్రియలో పాల్గొనరాదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, పళ్ళను తోముకొనుట, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి యగుట, ఏకాదశి రోజు అబద్ధము చెప్పుట వంటివి ఎంతమాత్రము చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడ మనిషి కంచుపాత్రలో భుజించరాదు; మాంసభక్షణము, ఎఱ్ఱపప్పు వంటివి తినరాదు; తేనెను త్రాగరాదు. అసత్య భాషణము, వ్యాయామము, కష్టించి పనిచేయడము, రెండు పూటల భోజనము, మైథున సంభోగము, గుండు గీసికొనుట లేదా గడ్డము చేసికొనుట, శరీరానికి తైలమర్దనము, ఇతరులు వండినదానిని తినడము చేయరాదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. వీటితోపాటు ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండ ఎప్పటికీ పాటించాలి. ఈ నియమనిబంధనల ననుసరించి వరూథినీ ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని (శ్రీకృష్ణుని) సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమలక్ష్యాన్ని సాధిస్తాడు. ఆ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు వేయిగోవుల దానఫలితాన్ని నిక్కముగా పొందుతాడు; పాపముక్తుడై అతడు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.”
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)