Categories
Vipra Foundation

మోహినీ ఏకాదశి

       సమస్త లోకాలలోని సాధు జనులకు ఎవరి వలన ఎలాంటి ఇబ్బంది కలగకుండా శ్రీమహావిష్ణువు చూస్తుంటాడు. బలహీనులపై బలవంతుల దాడి జరగకుండా, మంచివారిపై దుర్మార్గులు విరుచుకుపడకుండా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ధర్మాన్ని అతిక్రమించడానికి … సాధుజనులను హింసించడానికి ఎవరు ప్రయత్నించినా సాక్షాత్తు ఆయనే రంగంలోకి దిగుతుంటాడు.

       అసురలను అంతం చేయడానికి నరసింహ స్వామిగా … శ్రీ రాముడిగా … శ్రీకృష్ణుడిగా అవతరించిన శ్రీమహావిష్ణువు, ఆ అసురుల దృష్టి మరల్చడానికి మోహినీ అనే సుందరాంగిగా అవతారాన్ని ధరించాడు. ఈ నేపథ్యంలోనే ‘మోహినీ ఏకాదశి’ విశిష్టతను సంతరించుకుంది. వైశాఖ శుద్ధ ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని అంటారు.

        దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం పుట్టింది. అమృతాన్ని చేజిక్కించుకోవడానికి దేవతలతో దానవులు పోటీపడ్డారు. దానవులకు అమృతం దక్కితే సమస్త లోకాలు ప్రమాదంలో పడతాయని గ్రహించిన విష్ణుమూర్తి, మోహినీ రూపాన్ని ధరించాడు. తన సౌందర్యంతో దానవుల మతులు పోగొట్టి, అమృతం దేవతలకి మాత్రమే దక్కేలా చేశాడు.

       ధర్మబద్ధంగా నడచుకునే దేవతలకు అండగా నిలవడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు వైశాఖ శుద్ధ ఏకాదశిన మోహినీ అవతారాన్ని ధరించాడు. ఈ సందర్భంగానే ఈ ఏకాదశికి ‘మోహినీ ఏకాదశి’ అనే పేరు వచ్చింది. ఈ రోజున మోహినీ అవతారంలో వున్న విష్ణు మూర్తిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

       సుఖ సంతోషాలతో సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు ‘మోహినీ ఏకాదశి’ రోజున విష్ణుమూర్తిని పూజించాలని చెబుతుంటారు. ఈ విధంగా చేయడం వలన కష్టాలు మబ్బు తెప్పల్లా ఎలా తెలిపోతాయనేది ఈ వ్రత సంబంధమైన కథల్లో కనిపిస్తుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)