Categories
Vipra Foundation

శ్రీ సత్య సాయిబాబా పుణ్యతిథి

జననం : నవంబరు 23, 1926          మరణం : ఏప్రిల్ 24, 2011

       అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబరు 23న సత్యనారాయణ రాజు (సత్యసాయిబాబా) జన్మించారు. తనకుతానే బాబా అని ప్రకటించుకుని ప్రపంచ ఆధ్యాత్మికవేత్తగా సత్యసాయిబాబా ఎదిగారు. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు, విమర్శలను, ఆరోపణలను సైతం సత్యసాయిబాబా ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్తగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులున్నారు.

బాల్యం గడించింది ఇలా…

        అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెద్దవంకమరాజు రత్నం దంపతులకు 1926 నవంబరు 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిన్నప్పటి నుంచి పెద్దసోదరుడు శేషమరాజు వద్దనే ఉంటూ వచ్చారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సత్యనారాయణరాజు విద్యాభ్యాసం కూడా ఒక్కొక్క చోటు జరుగుతూ వచ్చింది. పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉరవకొండలో ప్రాథమికోన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల తరుణంలో ఒక రోజు సత్యనారాయణ రాజుకు తేలు కుట్టింది. అప్పటి నుంచి ఆయన మానసిక పరివర్తనలో మార్పు వచ్చింది. ఏదేదో మాట్లాడుతుండే వాడు. దీంతో ఆయన సోదరుడు శేషమరాజు ఆయన్ను తన స్వగ్రామమైన పుట్టపర్తికి పంపించారు. కొద్దిరోజులు తరువాత తాను దేవుడినని, తన పేరు ఇక నుంచి సత్యసాయిబాబా అని 1940లో ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సత్యనారయణ రాజు కాస్త సత్యసాయిబాబాగా పిలువబడుతూ వచ్చారు. అనంతరం ఆయన దక్షిణ, ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. తిరిగొచ్చాక కొన్ని మహిమలు చూపడంతో భక్తులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. 1944లో ఆయనకు మొట్టమొదటిసారిగా పుట్టపర్తిలో మందిరాన్ని నిర్మించారు. దీన్ని ప్రస్తుతం మందిరంగా పిలుస్తున్నారు. 1948లో ప్రశాంతి నిలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి క్రమక్రమంగా బాబా గురించి దేశవ్యాప్తంగా తెలియడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చేవారు. 1968లో మొట్టమొదటిసారి విదేశీ పర్యటన చేపట్టారు. క్రమక్రమంగా అక్కడి నుంచి కూడా విదేశీ భక్తులు పుట్టపర్తికి రావడం పెరిగింది.

విమర్శలు, ఆరోపణలు…

        సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయిబాబాగా ఎదిగే క్రమంలో ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం అనేక వ్యతిరేక కథనాలు వచ్చాయి. అన్నింటికంటే ఎక్కువగా విమర్శలకు గురిచేసింది 1993 జూన్‌ 6న ఆశ్రమంలో జరిగిన ఆరు హత్యలు. బాబా నిద్రించే గదిలోనే ఇద్దరు యువకులు తుపాకీతో కాల్చి హత్య గురికావడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించినందునే వారిని కాల్చి చంపారని అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. ఇకపోతే నోటిలో నుంచి శివలింగం తీయడం, గాలిలో విబూది తీయడం వంటివన్నీ మహిమలు కాదని, మ్యాజిక్‌ మాత్రమేనని ప్రముఖ హేతువాది ప్రేమానంద్‌ పేర్కొన్నారు. చంద్రుడు తన ప్రతిరూపం కనిపిస్తుందని అంతకు ముందు ఏడాది ప్రకటించి కనబడకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఆరోపణలేవీ ఆయన్ను పెద్దగా అడ్డుకోలేకపోయాయి. 2004లో బిబిసి అంతర్జాతీయ మీడియా ఛానల్‌ ‘ది సీక్రెట్‌ స్వామి’ అనే పేరుతో ఒక కథనాన్ని వెలువరిచింది. వీటన్నింటినీ సత్యసాయిబాబా భక్తులు తిప్పికొట్టగలిగారు.

ప్రపంచ వ్యాప్తంగా సేవా సమితులు…

       సత్యసాయి సేవా సమితులు ప్రపంచ వ్యాప్తంగానున్నాయి. 126 దేశాల్లోని 1200 చోట్ల సత్యసాయి సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారానే సత్యసాయి బాబా ట్రస్టు కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలే కాకుండా పుట్టపర్తిలోని ట్రస్టు కార్యకలాపాలన్నీ సేవాసమితి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. భద్రత మొదలుకుని అన్నీ కూడా సమితి సభ్యుల కనుసన్నల్లోనే నడుస్తాయి. ట్రస్టు లోపలి భాగంలో పోలీసులకు సైతం ప్రవేశం ఉండదు.

సేవా కార్యక్రమాలు…

       సత్యసాయి బాబా ఏర్పాటు చేసిన ‘సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు’ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, వైద్యం అందులో ప్రధానమైనవి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. వీటితోపాటు పలు జిల్లాలకు తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. అనంతపురం, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. చెన్నై నగరానికి తాగునీటి ప్రాజెక్టును చేపట్టారు. ఒరిస్సాలో 2008లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టారు.

సాయిబాబా బోధనలు క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చునని అంటారు:

  • ఒకటే కులం – మానవత
  • ఒకటే మతం – ప్రేమ
  • ఒకే భాష –హృదయం
  • ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు.

       హజరత్‌ మహమ్మద్‌ 1400 సంవత్సరాల కిందట భగవంతుని దివ్య వాణిని ‘ఖుర్‌ ఆన్‌’ రూపంలో పొందుపరిచాడు. ఇందులోని రెండు పదాలు సలాత్‌ , జకాత్‌ .అంటే ప్రార్థన , దానధర్మాలు .వీటిని ఆచరించే సమాజానికి ఇస్లాం అని పేరుపెట్టారు. ఇస్లాం అంటే శరణు , శాంతి అని అర్థం. ఎవరు భగవంతునికి శరణాగతులై నిరంతర శాంతితో జీవించడానికి పూనుకుంటారో ఆ సమాజమే ‘ఇస్లాం’. (ఈనాడు25.4.2011)

భారత దేశంలో వివిధ వార్తా పత్రికలు సాయిబాబా ఉపదేశాలను తరచు ప్రచురిస్తుంటాయి.

        బాబా 2011మార్ఛి 28న శ్వాసకోశ, మూత్రపిండాల మరియు ఛాతీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చబడ్డారు  దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు, సత్యసాయి బాబా ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిఛారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన బుధవారం ఉదయం మహా సమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలు లోనే అన్ని కార్యక్రమాలూ శాస్త్రోక్తంగా జరిగాయి. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని జులై 15 నుంచి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం ప్రారంభింఛారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)