Categories
Vipra Foundation

లక్ష్మీ పంచమి ప్రత్యేకత (చైత్రశుద్ధ పంచమి)

       ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది … అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.

       అలాంటి లక్ష్మీదేవిని ‘చైత్రశుద్ధ పంచమి’ రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

       ఈ విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే రోజున నాగదేవతను కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నాగప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.

       సాధారణంగా కొందరిని నాగదోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఎన్నో ఉబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకు కారణం నాగదోషం అనే విషయం కూడా చాలామందికి తెలియదు. నానారకాల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్లు ఈ రోజున నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)