Categories
Vipra Foundation

హోలి పండుగ – వసంతోత్సవం

     కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. మన్మధునికి మరో పేరే మదనుడు. అందుకే ఇది మదనోత్సవం, మధూత్సవం అన్న పేర్లతో కూడా పిలువబడుతోంది.

కాముని పున్నమి.. కామదహనం. వసంతోత్సవం. ఫల్గుణోత్సవం. డోలికోత్సవం.. హోలికాపౌర్ణమి. మదనోత్సవం. మధూత్సవం.. ఇలా ఎన్ని పేర్లున్నా చివరికి అందరి నోళ్లలోనూ నానే పేరు మాత్రం ‘హోలి’. ఫాల్గుణమాసంలో ‘శుక్ల పూర్ణిమ’ నే హోలి పండుగగా జరుపుకుంటాం.

      దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈరోజే బ్రహ్మసావర్ణి మన్వాది కూడా. అంటే బ్రహ్మ సావర్ణి దేవీ ఉపాసనతో మనువుగా వరం పొందిన గొప్ప రోజు.

కామదహనం వసంతోత్సవం

        ఒకానొక సమయములో కైలాసములో శివుడు, సతీ దేవీ ఉండగా దేవతలందరు కలిసి అటుగా ప్రయాణము అవుతున్న దృశ్యం వారికి కనిపించింది. వీరంతా ఎక్కడకు వెళుతున్నారని వాకబు చేయగా వారంతా దక్షయజ్ఞానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. సతీ దేవీ ఆశ్చర్యపడి, తన తండ్రి గారు ఆ విషయం తమకు ఎందుకు తెలుపలేదా అని అనుకున్న సమయంలో, పరమ శివుడు దక్షుడు తమను కించపరుస్తున్నాడని, తమను ఆహ్వానించలేదని చెపుతాడు, అయినా సతీ దేవీ అక్కడకు వెళ్లి అవమానం భరించలేక ఆత్మాహుతీ అవ్వటం మనకు తెలిసిన విషయమే. అంతేకాక శివుడు సతీ దేవీ ఆత్మాహుతి వార్త విని రుద్రుడై, కాలభైరవుణ్ణి సృష్టించటం, అతడు యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యటం జరిగింది. ఆ తరువాత శివుడు సతీదేవీ వియోగంతో కృంగి ఘోరతపస్సులోకి వెళ్ళటం జరిగింది. శివ జాడలేదని గ్రహించిన రాక్షసులకు ఒక పండుగగా మారి వారు చేసే దుశ్చర్యలకు ఎదురులేకపోయింది. దేవతలకు విషమ పరిస్థితులు ఎదురయ్యాయి, వారికి ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో అందరు ఆలోచించి, విరాగి అయిన శివుణ్ణి తపస్సు నుంచీ తప్పించి, వారి దృష్టిని మరల్చాలని ఆశించి, దానికి ఒక్క మన్మదుడే దిక్కని తోచి మన్మధుడిని ప్రేరేపించి, శివుడి మీద మన్మధబాణాలేసి వారి దృష్టిని మార్చాలని కోరారు. దేవతలంతా ఆ విధంగా కోరగా, మన్మధుడు ఇక వారి మాట వినక తప్పలేదు. అదే తడవుగా మన్మధుడు శివునిపైకి బాణాలు వెయ్యటం జరిగింది. తీవ్ర తపస్సులో వున్నా శివుడి తపస్సుకి భంగం కలిగింది. అతిరుద్రుడై కళ్ళు తెరచి చూశాడు, మన్మధుడు వరుసగా బాణాలు విసురుతున్నాడు. శువుడికి విపరీతమైన కోపం కలిగింది, క్షణాల్లో ఏం జరిగిందో ఉహించేలోగా శివుడి కోపాగ్నికి మన్మధుడు బూడిదవ్వడం జరిగిపోయింది. అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది. ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. మాగః శుక్ల త్రయోదశినాడు జరిగినదీ కామదహనం అనగా మన్మధ దహనం. మానవ జీవితానికి కోరికలే మొదటి శత్రువులు. కోరికలను కలిగించు కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన ఈ కామదహనం అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది. ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ కామదహనం ఓ పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది. కామదహనం జరిగిన తరువాత మన్మధుని భార్య అయిన రాతీదేవీ వచ్చి విషయం తెలుసుకొని తన భర్త భాస్మంగా మారడం చూచి దిగ్భ్రాంతి చెంది తన భర్త కోసం శోకించటం మొదలుపెట్టింది. దేవతలందరినీ పిలిచి మీరేనా నా భర్తను శివునిపైకి పంపారు. ఇప్పుడు ఇలా అయ్యింది. అంటూ భాధపడింది. దేవతలందరూ రతీదేవిని తీసుకొని శివుని దగ్గర చేరి ప్రార్ధించి తిరిగి మన్మధుని బతికించారు. మన్మధునికి శరీరం లేకపోయినా ఆయన చెయ్యవలసిన బాధ్యతలు అంటే దేవతలలు మానవులకు కోరికలు ప్రేరేపించడం జరుగుతుందని భార్య రాతీదేవికి మాత్రం శరీరంతోనీ కనిపిస్తాడని శివుడు వరం ఇచ్చాడు. అలా కాముడైన మన్మధుడు తిరిగి బ్రతికినందుకు వసంతోత్సవం ఆనందంతో చేసుకున్నారని అదే హోలీ అనీ, అదే వసంతోత్సవం అని అంటాము. ఆనాడు రతీమన్మధులను పూజిస్తే కుటుంబానికి సౌభాగ్యం ఆనందం కలుగుతుందని నమ్మకం.

 మరొక కథ

     హోలికను గురించి మరో కథ ప్రచారంలో వుంది. కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి. అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ ….. హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు ఈ హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు.

హోలికి సంబంధించిన మరొక ప్రస్తావన

శ్లో   :     సరోడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం

            ఫాల్గుణ్యాం సంయతో భూత్వా గోవిందస్యపురం ప్రజేత్. ||

     పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు ఈ రోజే ఉయలలలో ప్రవేశించాడని ఈ ఫాల్గుణ పూర్ణిమనాడు ఉయలలోని కృష్ణుని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

       హోళీ అనే పదం డోల అనే పదానికి ప్రతీకమని అలా హోలి పండుగగా ప్రసిద్దమైనదనీ మరి కొందరు అంటారు. ఏదేమైనా కామదహనం తరువాత జరిగే ఈ హోళీ వసంతోత్సవం ఇంత ప్రాచుర్యాన్ని సంతరించుకొని జాతి సమక్యైతను దారి తీసే విధంగా అందరిని ఆనందిమ్పచేస్తోంది. కాబట్టి తప్పక ఆచరింప తగిన పండుగ, ఇది జాతి, మత, స్త్రీ, పురుషుల వయో భేదం లకుండా కలిసిపోయి ఆనందంగా జరుపుకునే పర్వదినం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)