Categories
Vipra Foundation

శ్రీ మధ్వ నవమి

      మాఘశుక్ల నవమి ‘మధ్వ నవమి’ గా ప్రసిద్ధం. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం- శ్రీమధ్వాచార్యుల శ్రీవారి అవతారం. ఆయన ఆశ్వయుజ విజయదశమి నాడు 1238లో దక్షిణ కన్నడ పజక క్షేత్రంలో జన్మించారు. వాసుదేవుడని నామకరణం చేశారు. పన్నెండో ఏట అక్షితప్రేక్ష తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. ఆ వయస్సులోనే సకల శాస్త్ర జ్ఞానం సంపాదించుకున్నందువల్ల గురువులు వాసుదేవుడికి పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యే మార్గానికి చిహ్నంగా- శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.

       శూన్యవాదం, నిరీశ్వరవాదం ప్రబలి, జాతిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఆయన సదాచారాన్ని ప్రబోధించారు. ప్రభువుకు సత్‌కర్మలను నివేదించమని భక్తులకు ఆదేశించారు. వేదం కేవలం కర్మకాండ కాదు, నిత్య జీవన విధానానికి అన్వయించదగ్గ ఒక దివ్య ప్రబంధమని నిర్వచించారు. ఒక అనుష్ఠాన వేదాంతిగా భగవద్గీత, బ్రహ్మసూత్ర, మహాభారత, భాగవత పురాణ ఇత్యాది గ్రంథాలకు విపుల వ్యాఖ్యానాలు సమకూర్చారు. ప్రథమ హనుమ, ద్వితీయ భీమ, తృతీయ పూర్ణప్రజ్ఞ అన్న విశ్వాసం మేరకు శ్రీమధ్వాచార్యులు ఎన్నో మహిమలను ప్రదర్శించారంటారు. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.

       రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యులవారే. నేటికీ అనునిత్యం సుప్రభాత సేవలతో శ్రీకృష్ణ సేవా కార్యక్రమాలు ఆ క్షేత్రంలో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయి. అలా జరగటానికి అనువుగా, ఎనిమిది మఠాలను శ్రీమధ్వాచార్యులు ఏర్పాటుచేసి, ఎనమండుగురు తీర్థులను ప్రతినిధులుగా చేశారు. హృషీకేశ తీర్థులు పాలకూర్‌ మఠానికి, నరసింహ తీర్థులు అడమారు మఠానికి, జనార్దన తీర్థులు కృష్ణపుర మఠానికి, ఉపేంద్ర తీర్థులు పుట్టిగె మఠానికి, వామన తీర్థులు షిరూర్‌ మఠానికి, విష్ణుతీర్థులు సోడె మఠానికి, రామతీర్థులు కనిమార్‌ మఠానికి, అధోక్షజ తీర్థులు పెజావర మఠానికి అధిపతులై, గురువు ఆజ్ఞ మేరకు ‘పర్యాయ’  క్రమంలో కృష్ణుణ్ని కొలవటం గమనించదగ్గ విశేషం. ఈ పర్యాయ కార్యక్రమం ఇప్పటికీ క్రమం తప్పకుండా కొనసాగుతూ ఉంది.

       శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవిత కాలంలో మూడు పర్యాయాలు బదరీ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరి యాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వనవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశవ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అటు అతివాదానికి ఇటు మితవాదానికి మధ్యే మార్గంగా శ్రీమధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతం ఒక హితవాదమనే చెప్పాలి. అహం బ్రహ్మాస్మి అయితే నువ్వెవరివి అన్న ప్రశ్నకు, కేవలం శరణాగతి అయితే నీ గతేమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా తత్వవాదాన్ని ఆచార్యులవారు అనుసంధించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలతోపాటు కర్తవ్య కర్మ ఆచరణ ద్వారా శ్రీచరణాలు చేరవచ్చునని మార్గదర్శనం చేశారు.

       జగత్తు మాయా మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే. పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వతంత్రుడు. జీవోత్తముడు ఆచార్యుడు. ధర్మమార్గంలో, ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వులకు శిరోధార్యం.

       జీవిత కాలంలో ఆనందానుభూతి పొందగల సులభతరమైన భక్తిమార్గాన్ని ఆయన బోధించారు. అందుకే ఆచార్యులవారికి ఆనంద తీర్థులన్న నామధేయం బహుళ ప్రచారంలో ఉంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)