దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు – భోగిమంటలు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ముందురోజు భోగి పండుగగా ప్రసిద్ధి. ఈ భోగి పండుగనాడు పాత వస్తువులను, పాతచీపుర్లను, ఎండిపోయన కొబ్బరి మట్టలను, తాటాకులను పోగుచేసి తెల్లవారు ఝామున వేసే మంటలనే భోగిమంటలు అంటారు. ఇలా చేయడం వల్ల శని దూరమవుతుందని అంటారు.
ధనుర్మాసారంభంనుంచి గోదాదేవితో పాటు పాండురంగడి పూజ, కాత్యాయనీ వత్రం చేసిన భక్తులందరూ శ్రీ పాండురంగనికి గోదాదేవికి కల్యాణం ఈ రోజున జరుపుతారు.ప్రతినెలా సంక్రాంతి వచ్చినా మకర సంక్రాంతికి ప్రాముఖ్యం ఏర్పడి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనుచానంగా వస్తున్న ఆచారం.
ఈ సంక్రాంతి వేళలో శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం వంటి నాలుగు విధులను ఆచరిస్తే పునర్జన్మ వుండదని శాస్త్ర వచనం – ఉత్తరాయణంలో మరణిస్తే ఉత్తమగతి కలుగుతుందని అంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో దక్షిణాయనంలో నేలకొరిగిన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి వుండి స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు. సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి లభిస్తాయని అంటారు.
సంక్రాంతి రైతులకు పంట వచ్చే కాలం. ఈ రోజున ఇంటికి సున్నాలు వేసుకొని, గుమ్మాలకు మామిడితోరణాలు, బంతి మాలలు అలంకరించి పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతారు. కనె్నపిల్లలందరూ వాకిళ్లను అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారు చేసి పసుపుకుంకుమలతో వాటిని అర్చిస్తారు. తంగేడు పూలు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలను అలంకరించి ‘గొబ్బియలో,’ ‘గొబ్బియలో’ అంటూ గొబ్బిపాటలు పాడుతారు.
తెలతెలవారుతుండగానే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, పగటివేషగాళ్లు ఇలాంటి జానపద కళాకారులు ఇంటింటికి తిరిగి వారి కళను ప్రచారం చేసుకొంటారు. ఆ కళాకారులను రైతులు, గృహస్థులు గౌరవించి వారు పండించుకొన్న ధాన్యాదులను, కొత్తబట్టలు ఇచ్చి వారిని సంతోషపరుస్తారు. పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తారు. పక్షుల కోసం వరికంకులను వాకిళ్లకు కట్టి వాటికి విందుచేస్తారు. ఈ భోగిపండుగ మూడవ నాడు కనుమను జరుపుతూ పశువులను అలంకరించి, పొంగళ్లను పెట్టి పశుపూజను చేస్తారు. ఇలా సంక్రాంతి మూడురోజులు జరుపుకుంటూ తమ జీవితాలలో నూతన కాంతి తెస్తుందని ఆబాలగోపాలం సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు.
శుచి శుభ్రతలను పాటించమనే ఈ భోగిపండుగ శాస్తర్రీత్యా కూడా ఆరోగ్యాన్నిస్తుందంటారు. మూగజీవాలను కూడా కాపాడమనే ఈ భోగి మానసిక శాంతిని కలుగచేస్తుందంటారు కొందరు. జప తప ధ్యానాది ఆధ్యాత్మిక సాధనలు, పురాణ పఠనాదులు, దానధర్మాలు, మొదలైన సత్కర్మల ద్వారా విముక్తి లభింపచేసే శక్తి ఈ పండుగకు ఉందని పెద్దలంటారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)