నారదుడు పృథు చక్రవర్తితో ఇలా చెప్పసాగాడు…..
‘’పృథు నృపాలా! కార్తీక వ్రతస్తులైన వారు పాటించవలసిన నియమాలు చెప్తాను విను.
కార్తీక వ్రత నియమాలు
- కార్తీక వ్రతం చేసేవారు మాంసం, తేనె, రేగుపండ్లు, ఉసిరికాయలు తినకూడదు.
- పరాన్న భుక్తి, పరద్రోహం, దేశాటనలను వదిలిపెట్టాలి.
- తీర్ధయాత్రలు అయితే చేయవచ్చును. దేవ, బ్రాహ్మణ, గురు, రాజ, స్త్రీలను, గోవ్రతస్తులను దూషించకూడదు.
- అవిసెనూనె, నువ్వులనూనె, విక్రయాన్నం, నింద్యవ్యంజనాయుక్త భోజనం, దూషితారాహారం తీసుకోకూడదు.
- ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రలు తదితర హీన ధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవుల పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను తీసుకోకూడదు.
- బ్రాహ్మణులు, అమ్మే రసాలను, భూజాత లవణాలను వదిలేయాలి.
- రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటల్లో ఉండేవాటిని దైవానికి నివేదించని అన్నం – ఈ మూడింటిని మాంసతుల్యాలుగా భావించి వదిలేయాలి.
- బ్రహ్మచర్యాన్ని పాటించి, నేలమీదే పడుకోవాలి.
- విస్తరాకులోనే భోజనం చేయాలి.
- నాలుగవజామున భుజించడమే శ్రేష్ఠం.
- కార్తీక వ్రతస్తులు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాల్లో తైల అభ్యంగనం చేయకూడదు.
- విష్ణువ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను వదిలేయాలి.
- ఎంగిలి ఆహారాన్ని, కాకులు తాకినా ఆహారాన్ని, ఆశ, ఔచ సంబంధిత పదార్థాలు, ఒకసారి వండి, మళ్ళీ ఉడికించినవి, మాడిన పదార్థాలు తినకూడదు.
- శక్తికొద్దీ విష్ణు ప్రీతికై కృచ్ఛాదులను చేయాలి.
- గుమ్మడి, వాకుడు, సరుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు పొట్ల, రేగు, వంకాయ, ఉల్లి – వీటిని పాడ్యమి మొదలు తినకూడదు.
- కార్తీకమాసంలో కూడా ఉసిరికాయలు తినకూడదు.
- ఈవిధంగా తినకూడని వాటిని వదిలేయాలి. కొన్నిటిని బ్రహ్మార్పణ చేసి భుజించాలి. కార్తీకమాసంలో చేసినట్లే, మాఘమాసంలోనూ చేయాలి.
కార్తీక వ్రతాన్ని యధావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. వంద యజ్ఞాలు చేసినవారు కూడా స్వర్గాన్నే పొందుతున్నారు. కానీ, కార్తీక వ్రతస్తులు మాత్రం ఏకంగా వైకుంఠాన్ని పొందుతున్నారు. కనుక యజ్ఞ యాగాదులకన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి.
ఓ రాజా! భూమ్మీద ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్తునిలోనే ఉంటాయి. విష్ణు అధీనులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా కార్తీక వ్రతస్తులను సేవిస్తారు. విష్ణు వ్రతాచరణపరులను ఎక్కడ పూజిస్తారో అక్కడ గ్రహ, భూత, పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యధావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువకుండా ఆచరించేవారు తీర్ధయాత్రలు చేయవలసిన అవసరమే లేదు.
ప్రజారంజనశీలా! పృథునృపాలా! ఇక ఈ కార్తీక వ్రత ఉద్యాపనా విధిని సంగ్రహంగా చెప్తాను, విను..
ఉద్యాపనా విధి
విష్ణు ప్రీతి కోసము, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశినాడు వ్రతస్తులు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి మండపం ఏర్పాటు చేయాలి. దానికి నాలుగు ద్వారాలు, వాటికి తోరణాలు, పుష్ప వింజామరలు అలంకరించాలి. నాలుగు ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరచి, వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో ”సర్వతోభద్రం” అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితం, నారికేళ సంయుక్తం అయిన కలశం ప్రతిష్ఠించి, శంఖ చక్ర గదా పద్మధారి, పీతాంబరుడు, లక్ష్మీసమేతుడు అయిన నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్ర లేచి, త్రయోదశినాడు దేవతలకు దర్శనమిచ్చి, చతుర్దశినాడు పూజనీయుడై ఉంటాడు కనుక, మానవుడు ఆరోజున నిర్మలచిత్తుడై ఉపవాసం ఉండి, విష్ణు పూజను ఆచరించాలి.
గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణరూపమందు ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించి, పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవిస్తూ, మర్నాడు ప్రాతఃకాలకృత్యాలు పూర్తిచేసుకుని, నిత్యక్రియలను ఆచరించాలి. తర్వాత నిష్కల్మష అంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి, యధాశక్తి దక్షిణ ఇవ్వాలి.
ఈవిధంగా వైకుంఠ చతుర్దశినాడు ఉపవసించినవారు, విష్ణుపూజ చేసినవారు తప్పక వైకుంఠాన్నే పొందుతారు.
”ఓ బ్రాహ్మణులారా! మీరు సంతోషించుటచేత నేను విష్ణు అనుగ్రహాన్ని పొందెదను గాక. ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మల్లోని నా పాపాలు నశించును గాక! నా కోరికలు తీరునుగాక! గోత్రవృద్ధి స్థిరమగును గాక” అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి.
వారిచేత ‘తథాస్తు’ అని దీవెనలు అందుకుని, దేవతోద్వాసనలు చెప్పి, బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువుకు దానం ఇవ్వాలి. అటుతర్వాత సజ్జనులతో కలిసి భోజనాదులు పూర్తిచేసుకోవాలి.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)