Categories
Vipra Foundation

కార్తీక పురాణం 20వ అధ్యాయం : పురంజయుడు దురాచారుడగుట

       చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ గురువర్యా! కార్తీకమాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలున్నాయా? అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది” అని కోరాడు. దానికి వశిష్టులవారు మందహాసంతో ”ఓ రాజా! కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రి మునికి చెప్పిన విషయం వివరిస్తాను” అని ఇలా చెప్పసాగారు.

       పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి… ”ఓ అత్రి మునీ! నీవు విష్ణువు అంశలో పుట్టావు. కాబట్టి నీకు కార్తీక మహత్యం ఆమూలాగ్రంగా (ఆది నుంచి అంతం వరకు) తెలుసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు”  అని కోరాడు. దానికి అత్రి మహాముని ”ఓ కుంభసంభవా! కార్తీక మాసానికి సమాన మాసం లేదు. వేదాల్లో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడికంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా… కార్తీకంలో నదీస్నానం చేసినా.. శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా… దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసముంది. చెబుతాను విను… త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశపురాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పువ చ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై… దుష్టబుద్ధి కలవాడై.. దయాదాక్షిణ్యాలు లేక… లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి, వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకొచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ… ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టీకాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి, అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళౄలను తీసుకుని అయోధ్యను చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి, యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చసేది లేక… తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే… తన శక్తి బలహీనంగా ఉన్నా… తుదికంటా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్రసమన్వితమైన రథాన్ని ఎక్కి, సైన్యాధిపతులను పురికొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్దుడయ్యాడు. యుద్ధభేరీ మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా? అన్నట్లు పెద్దఎత్తున హుంకరించారు. శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం వింశాధ్యాయ: (20అధ్యాయం) సమాప్త:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)