ధనలోభుడు తిరిగి ఆంగీరసులవారితో ఇలా అడుగుతున్నాడు…. ”ఓ మునిచంద్రా! మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది. జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిశ్యుడను. తండ్రి-గురువు-అన్న-దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీవంటి పుణ్యమూర్తుల సాంగథ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే… అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా? అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి, ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విషదీకరించండి” అని కోరాడు.
దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు… ”ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను” అని ఇలా చెప్పసాగెను…
“ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ, ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడేజాతివాడు? ఎలాంటి కర్మలు ఆచరించాలి? అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక, సత్కర్మలనాచరించినా, అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా… వైశాక మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా… మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా… అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాత:కాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలాచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాత:కాలంలోనే స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మబ్రష్టుడవుతాడు. కార్తీకమాసంలో అరుణోదయస్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీకమాసంతో సమానమైన నెలగానీ, వేదాలతో సరితూగే శాస్త్రంగానీ, గంగాగోదావరులకు సమాన తీర్థాలుగానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖమూ, ధర్మంతో సమానమైన మిత్రుడూ, శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీకమాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు” అని వివరించెను.
దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నఇస్తున్నాడు…. ”ఓ మునిశ్రేష్టా…! చాతుర్మాస్య వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు…” అని కోరాడు.
ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు…. ”ఓయీ…! చాతుర్మాస్య వ్రతమనగా మహా విష్ణువు, మహాలక్ష్మీదేవితో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున నిద్రలేస్తారు. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా… ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను.
తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా… ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, కోటిసూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి… ఏమి తెలియనివాడిలా మందహాసంతో ‘నారదా క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్టానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా?’ అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ‘ఓ దేవా… ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా… నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ, అవి పూర్తికాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము’ అని ప్రార్థించెను.
జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది, లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షుఉలున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు, అతను ముసలిరూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ‘ఈ ముసలివానితో మనకేమి పని’ అని ఊరకుండిరి. గర్విష్టులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి, ‘వీరిని ఎలా తరింపజేయాలి?’ అని ఆలోచిస్తూ… తన నిజరూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ధరించి, లక్ష్మీదేవితోను, భక్తులతోనూ, మునిజన ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంఉటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారయణుడిని దర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి, ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు…
శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||
శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం
త్వాం త్రైలోక్య కుటుంబినిం శర సిజాం వందే ముకుంద ప్రియం||
ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టా దశాధ్యాయం – పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)