ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.
వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం- ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు న్విహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని, అత్యంత సంరంభంగా జరుపుతారు. ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు. ‘ఆమాదేర్ జ్యోతిషీ’ గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. ‘ధన్ తేరస్’ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.
ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి, పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.
ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య, సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే, శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.
యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడు తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య, తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాశులుగా పోసి, ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ, బంగారం, వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి, వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ, ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి, బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి- ధన త్రయోదశి.
ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మాన వులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.
‘చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ
తషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ అని శాస్త్ర వచనం.
‘చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగి స్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)