పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది.మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.
నరక చతుర్దశి నాడు సూర్యోదయమునకు ముందుగా లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగువత్తులతో దీపమును దానము చేయాలి. సాయంకాలం గుళ్ళలో దీపాలని వెలిగించాలి. ఆనాటి వంటలో మినప ఆకులతో కూర వండుకుంటారు.
అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేస్తారు. సాయంత్రము లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్ళలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగా చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్ళల్లో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో, నూతులలో(బావి) తెప్పలవలే వదులుతారు.
ఆనాటి రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని(అలక్ష్మి, పెద్దమ్మారు,దారిద్ర్యానికి సూచన) ఇండ్లనుండి తరుముతారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజింస్తారు. ఇది మూడవ రోజు. బలిపాడ్యమి. ఉదయము జూదములాడుతారు. ఆరోజు గెలిచిన వారికి సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఈనాడు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు.అందులో ప్రధానమైనవి:
1.నరకాసుర వధ
2.బలిచక్రవర్తిరాజ్య దానము
3.శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని
4.విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు
ఈ కథలలో బలిచక్రవర్తికథ తప్ప మరి ఏది వ్రతగ్రంథములలోను,ధర్మశాస్త్రగ్రంధములలోను కనిపించదు. ధర్మసింధువంటిఅన్ని గ్రంధములలోను బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడింది. నేడు దీపావళి అనగానే మనకు గుర్తువచ్చే బాణాసంచ కాల్పులుకు ఆధారమైన నరకాసురవధ ఎంతో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ కథ ప్రస్తావన వ్రతగ్రంధములలో కనపడదు.నరకభయనివారణార్థము అభ్యంగనస్నాము, దీపములతో అలంకరించటం,లక్ష్మీపూజ తదితర విషయములు తెల్పబడ్డాయి. ఈ వ్రత గ్రంధాలలోని “నరక”శబ్దానికి నరకము అనుటానికి మారుగా “నరకాసురుడు” అని అన్వయించి తర్వాతివారు పురాణకథతో జోడించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం.ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమగు రహస్యం ఇమిడి ఉన్నదని కొందరి అభిప్రాయం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
- నరకాసురవధ వృత్తాంతము
విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రమున ప్రవేసించి, ఆ రాక్షసుడిని చంపి, భూమిని మరల పైకి తీసుకువచ్చాడు. ఆ సమయమున వరహా అవతారముననున్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణ్డువు తాను త్రేతాయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలుపాడు.
త్రేతాయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినపుడు,భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారము చేయవలెనని ప్రమాణము చేయించుకున్నది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమరుని పెంచి, నరకుడని నామమునిచ్చి విద్యా బుద్ధులను నేర్పించాడు.నరకునకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగాతీరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది.విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి అయుధాన్ని, దివ్య రధమును అనుగ్రహించి,కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరము రాజధానిగా పాలించుకొనుమని చెప్పి భూదేవితోగూడి అదృశ్యమయ్యాడు.
నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపరయుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్టులవారు “నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అవమానించుతున్నావు. నీ జన్మదాత చేతనే మరణించెదవు” అని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణములేకుండునట్లు వరమును పొందాడు. ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు.
వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించగా, ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామాదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు.ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు రోజులు ప్రజలు ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
2 బలిచక్రవర్తి రాజ్యదాన వృత్తాంతము
బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
3 శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి చేరుకున్న వృత్తాంతము
పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యా నగరాన్నితిరిగి చేరుకున్నరోజున తిథి అమావాస్య ! ఆ రాత్రంతా చీకటిమయంగా వుండటంతో ఆ చీకటిని పారదోలేందుకుగాను అయోధ్యా నగరవాసులు లక్షల సంఖ్యలోకాగడా దీపాలని వెలిగించి నగరాన్నిపట్ట పగలులా ప్రకాశించేలా వెలుగుల్నిచిమ్మించారు. అలా పౌరులు హర్షాతిరేకంతో ఎదురెళ్ళి శ్రీరామునికి స్వాగతం పలికిన అరేయి కాస్తా దీపావళిగా మన దేశచరిత్రలో నిలిచిపోయింది. ఆనాడు అయోధ్యానగర పౌరులు పొందిన ఆనందాన్ని ఈతరంలో మనం కూడా పంచుకుంటున్నట్లుగా ప్రతి ఏటా ఆసంతోష ఘడియల స్మరణార్థం ఈ దీపావళి పండుగని జరుపుకుంటున్నాము.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)