Categories
Vipra Foundation

కార్తీకపురాణం అయిదో అధ్యాయము : వనభోజన మహత్యం

       వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివృతియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరి కాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యదోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణకాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మంపోయి నిజ రూపం కలిగింది” అని చెప్పారు. అది విన్న జనకుడు ”ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…

కిరాతుడు, ఎలుకలకు మోక్షం

       రాజా! కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకో కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి ”బిడ్డా…! నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖంగా… ”స్నానం చేస్తే మురికి పోతుంది. అంతే…! దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.

       దాంతో ఆ బ్రాహ్మడు ”ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావిచెట్టు తొర్రలో ఎలుక రూపంలో బదుకుదువుగాక” అని శపించాడు. ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి… ” నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన ” బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా.. కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.

       తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిస్తూ, పండ్లు తింటూ బతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో అతను నివాసమేర్పరుచుకోవడం వల్ల నదీస్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ, మహాభారతాలు, పురాణగాథల్ని చెప్పుకొనేవారు. కార్తీకమాసంలో ఒకానొకరోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావిచెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీకపురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. రుషిదగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు.

అంతలో ఒక కిరాతకుడు చెట్టుకింద ఉన్నవారిని దూరం నుంచి చూసి ”ఓహో… ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బేడబ్బు” ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి ”మహానుభావులారా…! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు ” ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు” అన్నారు.

       అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా… కిరాతకుడికి తన పూర్వజన్మ వృంతాతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత రుషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా పురాణమంతా వినడం, చెట్టుకింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో ”మునివర్యా! ధన్యుడనయ్యాను. మీ వల్ల నేను మూషిక రూపం నంచి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.

        “కాబట్టి జనకమహారాజా…! ఈ లోకంలో సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమాచరించాలి” అని వివరించారు.

            స్కాంధపురాణాంతర్గతమైన కార్తీక మహత్యం అయిదో అధ్యాయం సంపూర్ణం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)