Categories
Vipra Foundation

కార్తీకంలో ఛట్ పూజ “సూర్య షష్ఠి”

       కార్తీకమాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్యుని ఆరాధించడంవల్ల కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమౌతాయని నమ్ముతారు. తాము, తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మనదేశంలో ఉత్తరాదిన ఈ ఛట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు.

       ఛట్ పూజ కార్తీకమాసం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు. షష్టినాడు జరుపుకునే పండుగ, సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అంటారు. కొందరు ఈ ఛట్ పూజను కార్తీక షష్ఠికి రెండు రోజులు మొదలుపెట్టి, రెండురోజుల తర్వాతి వరకు అంటే నాలుగురోజులపాటు జరుపుకుంటారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు.

       ఛట్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు. కొందరైతే దీక్షబూని 36 గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఛట్ పూజ జరుపుకున్నవారు కపటం లేకుండా నిజాయితీగా ఉంటారు. ఆడంబరాలకు దూరంగా గడుపుతారు. మంచంమీద కాకుండా నేలమీద ఒక దుప్పటి పరచుకుని పవళిస్తారు.

పాండవులు, ద్రౌపది ఛట్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలు ఉన్నాయి.

        బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. మనదేశంలో సంస్కృతీ సంప్రదాయాలు కొంతవరకూ తగ్గుతుండగా ఇక్కణ్ణుంచి వెళ్ళి ఇతర దేశాల్లో నివసిస్తున్న మనవాళ్ళు హిందూ పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఛట్ పూజను సైతం విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వేడుక చేసుకుంటున్నారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)