Categories
Vipra Foundation

“బాలల దినోత్సవం” – జవహర్లాల్ నెహ్రు జయంతి

        బాల్యం ఓ అద్భుత వరం. బాల్యం ఓ తీయని అనుభూతి. బాల్యంతో కాలం కూడా స్నేహం చేస్తుంది. తిరిగిరాని బాల్యమంటే తరిగిపోతున్న వయసుకు ఆందోళన. అది మరలిరాదని తెలిసినా ఆగిపోని ఆవేదన. ఐనా బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు. ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే. అందుకే వారి కోసం ప్రత్యేకమైన ఆటలు, ప్రత్యేకమైన పాటలు, ప్రత్యేకమైన తోటలు. ఆ కోవలోనే వారికోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతోంది బాలల దినోత్సవం. ప్రపంచం మొత్తం జరుపుకునే వేడుక ఇది. ఒక్కో దేశంలో ఒక్కొ రోజు జరుపబడుతుంది. మన దేశంలో నవంబర్ 14న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు జన్మ దినాన జరుపబడుతోంది. నెహ్రూ జన్మదినోత్సవం నాడే ఈ వేడుక జరపుకోడానికి నెహ్రూకి బాలలపట్ల ఉన్న ప్రేమే కారణం. ఆయన పసిపిల్లలతో దిగిన అనేక ఫొటోలు పిల్లలపట్ల ఆయన ప్రేమను తెలియజేస్తాయి.

        బాలల దినోత్సవం ఒక పండుగలా దేశమంతటా నిర్వహించబడుతూంది. ఈ వేడుకకు అంతర్జాతీయంగా వచ్చిన గుర్తింపు బాలలకు ఈ వేడుకపట్లగల మక్కువను తెలియజేస్తూంది. తమకంటూ ఓ ప్రత్యేక వేడుక ఉన్నదన్న ఆనందం వారిలో ఆ రోజు ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరిపించే రీతిలో ఈ దినోత్సవం జరుపబడుతోంది. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అభినందించి తీరవలసిందే. పైగా ఆ రోజు వివిధ టీవీ చానెళ్ళలో వీరికోసం ప్రసారం చేయబడే వివిధ కార్యక్రమాలు కూడా వీరికి ఎంతో ఉత్తేజాన్నిస్తుంటాయి. మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగానే ఈ వేడుకలు నిర్వహించబడుతున్నా అందరు బాలల దగ్గరకు ఈ వేడుకలు చేరువవుతున్నాయా అంటే ఆలోచించకతప్పదు. వీధి బడుల్లో కూడ కాస్తో కూస్తో ఘనంగానే నిర్వహించబడుతున్న ఈ వేడుకలు వీధి బాలలకు మాత్రం చేరువవడంలేదన్నది ఓ చేదు వాస్తవం. బాలలంటే బడి పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే ఏకైక ఆలోచనకు బలవంతంగా బద్ధులై బ్రతికే సగటు బాలుడు బడి బాలుడులాంటి బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు?

        బాలలందరికీ నిర్దేశించబడిన ఈ బాలల దినోత్సవం చదదువుకునే బాలలకు మాత్రమే పరిమితం కావడం వెనుక ముఖ్యంగా ఆర్ధిక కారణాలే ఉంటాయి. ఆర్ధిక అసమానత్వం బాలల్లో కూడా అంతరాయాలను పెంచడం దారుణం. తల్లిదండ్రులకు మాత్రమే పరిమితం కావలసిన ఆర్ధిక విషయాలు బాలలకు బాధ్యత కావడం మన చట్టాల అమలులోని లోపభూయిష్టతను చూపుతోంది. దేశ ఆర్ధి పరిస్థితి మెరుగుదలకు ఇతర రంగాలపట్ల శ్రద్ధ చూపించే మన సంస్కరణలు బాల వ్యవస్థ సంస్కరణకు ప్రత్యేకమైన శ్రద్ధను చూపడం లేదు. “నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు” అన్న స్లోగన్ ఏవిధంగా భావి భారత పౌరులో నిర్దిష్టంగా చెప్పలేకపోతుంది. విద్యా సంస్కరణలు ఎన్ని వచ్చినా, విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పధకాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు వంటి ఎన్నో సంస్కరణలు బాలల అభ్యున్నతి కోసం చేపట్టినా వీధి బాలల వ్యవస్థను రూపుమాపలేకపోతుంది. మధ్యలో బడి మానేసిన విద్యార్ధులకోసం బ్రిడ్జి స్కూళ్ళ నిర్వహణ కొంతవరకు ఉపయోగపడుతున్నా బాలలను పూర్తిగా సమాజంలో భాగస్వాములను చేయలేకపోతోంది. చట్టాలను కఠినంగా అమలుచేయడమే కాదు సమాజంలో ఆ చట్టాల పట్ల అవగాహన పెంపొందేందుకు కృషి చేయాలి.

        బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్ను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటుచేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. కేవలం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు బాలల కోసం ప్రత్యేకంగా స్థాపించబడి వారి ఉన్నతికి కృషి చేస్తున్నప్పటికీ బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన చెందకపోవడం వెనక గల కారణాలను అన్వేషిస్తే పేదరికమే ముందు స్థానంలో నిలుస్తుంది. దానికితోడు పేద కుటుంబ వ్యవస్థకు నానాటికీ పూర్తిగా దూరమవుతున్న విద్య మరో కారణమవుతుంది. బాల వ్యవస్థ పునర్నిర్మాణం కోసం ప్రవేశపెట్టబడ్డ పధకాలను గురించి తెలుసుకోలేని నిస్సహాయతను ఇది కల్పిస్తోంది. మెరుగైన సమాచారం వారికి అందుబాటులోకి రాకుండాపోతోంది. అందుకు ఏ ఒక్కరినో నిందించనవసరంలేదు. ఇప్పటికే పల్స్ పోలియోను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వికలాంగులకు వీలులేని వ్యస్థను రూపొందించడానికి ప్రభుత్వం ఏళ్ళ తరబడి ఎంతగానో కృషి చేస్తోంది. ఆ దిశలో సాధించిన ముందడుగు సామాన్యమైందేమీ కాదు. పోలియో నిర్మూలనకు నడుంకట్టి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటుకు చేస్తున్న కృషి త్వరలోనే సత్ఫలితాలు ఇవ్వనుంది. దీనితోపాటు హెచ్.ఐ.వి./ఎయిడ్స్కు గురైన అమాయక బాలలకు పునరావాసాన్ని కల్పించడంలోనూ నిరంతరం కృషిచేస్తూ ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇప్పుడిప్పుడే చట్టాన్ని సమర్ధవంతంగానూ, కఠినంగానూ అమలుచేసేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా సైకిల్ షాపుల్లోనూ, మెస్సుల్లోనూ, టీ బంకులలోనూ, ఇళ్ళలో పనిమనుషులగానూ బాల్యం కర్పూర హారతై పోతున్న కుటుంబాలలో వెలుగు రేఖలను ప్రసరింపజేస్తోంది. అనేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాలల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తోంది.

అసలు వీటన్నిటికి తోడు బాలలకు కావలసిందేమిటో వారినుండే తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా ఉందన్న విషయం ముందుగా గమనించాలి. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తమకు సముచితమనిపించిన పధకాలను రూపొందించడం, తమకు అనువైన రీతిలో వాటిని నిర్వహిస్తూ పోవడం ద్వారా మాత్రమే బాల కార్మిక వ్యవస్థగానీ, బాలలకు సంబంధిన మరే పధకమైనాగానీ ఫలవంతం అవుతుందనుకోవడం సమంజసం కాదు. బాలల మనోభావాలను అర్ధం చేసుకునే వ్యవస్థ ఆవిర్భావం ముందుగా జరగాలి. బాలలు-వారి పరిసరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. బాలలంటే ఉన్న చులకన భావం పోయి బాల భవిత చల్లన అనే భావన అందరి హృదయాన కలిగిన రోజునే నిజమైన బాలల దినోత్సవం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)