Categories
Vipra Foundation

‘త్రిరాత్ర వ్రతదీక్ష’

తొమ్మిది రోజులూ దీక్ష పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.

అష్టమి అంటే దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి. అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో, కుంకుమార్చనలతోనూ అర్చిస్తే, సత్ సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవు. నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. నవమి రోజున మహార్నవమిఅంటూ పూజ చేస్తారు. పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు. అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది. కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు.

దశమి రోజున శమీ పూజ చేస్తారు. దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి. ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు. పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారుట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట. తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడ లేకుండా చేస్తుంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)