పూర్వం చోళ దేశంలో ధర్మాంగదుడనే రాజుకి ఎన్నో నోముల అనంతరం తన అర్థాంగికి శ్రీలక్ష్మి జన్మించగా ఆమెకు ఎన్నో గండాలు వచ్చినప్పటికి బ్రతికి నందువల్ల బతుకమ్మ అని పేరు పెట్టటం జరిగిందని జన శృతి. రాక్షస సంహారం చేసి అలసిపోయిన ఆ ఆదిపరాశక్తిని సేద తీర్చి పది రోజులపాటు ఆ తల్లికి సేవలు చేసి తరించిపోయే మహిళల పాలిట కల్పవల్లి, కరుణామతల్లి ఆ బతుకమ్మ. భాద్రపద అమావాస్య(పెత్రమవస్య)తో ప్రారంభించి మహర్నవమితో ముగించబడే బతుకమ్మ పండుగ నవమిరోజు ‘సద్దుల పండుగ’ పేరుతో తిరిగి పెద్ద ఎత్తున ‘బతుకమ్మ’ పేర్చుకొని వైభవంగా పండుగను జరుపుకుంటరు. బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ, బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.
మైదానానికి చేరుకొని బతుకమ్మ ఆటను ఆడుతరు. బతుకమ్మను పెట్టి ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండిచెట్టు గాని పెట్టి, గౌరమ్మను నిల్పి పూజ చేసి ఆట మొదపూడతరు. స్త్రీలు వలయాకారంగా నిలబడి కుడివైపుకు జరుగుతూ, చప్పట్లు చరుస్తూ, వంగి లేస్తూ, ఒక స్త్రీ పాట చెబుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ పాడుతుంటరు.
ఇలా సాగే బతుకమ్మ ఆట పాటను గమనిస్తే ఈ పండుగ ప్రయోజనమేమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాలవారు కలిసి ఆడటంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతయి. భారతదేశ ఔన్యత్యాన్ని, తెలంగాణ ప్రశస్థిని తెలిపే ఈ సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతోంది. స్త్రీల సమైక్యత, వారిలోని కళాత్మకత ఈ సందర్భంగా చక్కగా వెల్లడవుతుంది.
కుటుంబం, అనుబంధం, చారివూతక నేపథ్యం, పౌరాణికతలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా ఆ సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతం.
బతుకమ్మ ఆట తరువాత స్త్రీలు కోలాటాలు వేస్తరు. ఈ కోలాటాలను కొన్ని చోట్ల కర్రలతో, మరికొన్ని చోట్ల ఇత్తడి, వెండి కోలలతో, మరికొన్ని ప్రాంతాలలో చేతులతో వేస్తూ ఆనందిస్తరు. ఈ కోలాటం పాటలు రసరమ్యంగా, ఆనందంగా, వినోదాత్మకంగా ఉంటయి.
‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన….’ అంటూ సాగే పాటపూన్నో పాడుకుంటరు.
అదే విధంగా గౌరిపూజ చేసి, గౌరమ్మ కళ్యాణం (పసుపు ముద్ద గౌరమ్మ) చేసి, గౌరిని అంటే బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడుకుంటరు. ఈ పండుగ వేళ చేసే ప్రతీ పని ఆట, పాట అన్నీ మానవ జీవితంలోని సన్నివేశాలను ముఖ్యంగా స్త్రీలు కోరుకునే పేరంటం, సౌభాగ్యాలను చిత్రిస్తయి.
వినవంతూ నింట్లో పుట్టి హిమవంతూ నింట్లో పెరిగి…’ అంటూ సాగే పాటలు స్త్రీల ఉద్దేశ్యాలను తేటతెల్లం చేస్త్తయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!
ఆనాటి కాలాన … ఉయ్యాలో!
ధర్మాంగు డను రాజు … ఉయ్యాలో!
ఆరాజు భార్యయు … ఉయ్యాలో!
అతి సత్యవతి యంద్రు … ఉయ్యాలో!
నూరు నోములు నోమి … ఉయ్యాలో!
నూరు మందిని గాంచె … ఉయ్యాలో!
వారు శూరు లయ్యి … ఉయ్యాలో!
వైరులచె హత మైరి … ఉయ్యాలో!
తల్లిదండ్రు లపుడు … ఉయ్యాలో!
తరగని శోకమున … ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి … ఉయ్యాలో!
దాయాదులను బాసి … ఉయ్యాలో!
వనితతో ఆ రాజు … ఉయ్యాలో!
వనమందు నివసించె … ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి … ఉయ్యాలో!
జనకోసం బొనరింప … ఉయ్యాలో! ….
….
ఊరికి ఉత్తరాన ..
ఊరికి ఉత్తరానా … వలలో
ఊడాలా మర్రీ … వలలో
ఊడల మర్రి కిందా … వలలో
ఉత్తముడీ చవికే … వలలో
ఉత్తముని చవికేలో … వలలో
రత్నాల పందీరీ … వలలో
రత్తాల పందిట్లో … వలలో
ముత్యాలా కొలిమీ … వలలో
గిద్దెడు ముత్యాలా … వలలో
గిలకాలా కొలిమీ … వలలో
అరసోల ముత్యాలా … వలలో
అమరీనా కొలిమీ … వలలో
సోలెడు ముత్యాలా … వలలో
చోద్యంపూ కొలిమీ … వలలో
తూమెడు ముత్యాలా … వలలో
తూగేనే కొలిమీ … వలలో
చద్దన్నమూ తీనీ … వలలో
సాగించూ కొలిమీ … వలలో
పాలన్నము దీనీ … వలలో
పట్టేనే కొలిమీ … వలలో
……
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)