Categories
Vipra Foundation

కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం)

మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ -, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ….

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్కిషన్రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు

అనితర సాధ్యం కాళోజీ మార్గం – పి.వి.నర్సింహారావు

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించిత్తు జంకలేదు. ఆ భగవంతునికి కూడా భయపడను కానీ కాళోజీ నారాయణరావు చూస్తే వణికిపోతాను’ అని పి.వి.నర్సింహారావు కాళోజీ సంస్మరణ సభలో అన్న మాటలు ఆయనను ప్రేమించే అందరికీ వర్తిస్తాయి.

తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని శాసనమండలిలో ధైర్యంగా బయటపెట్టగలిగినవాడు కాళోజీ నారాయణరావు. తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను కూల్చడానికి మహత్తర సాయుధ పోరాటమే జరిగింది. ఆంధ్ర మహాసభ చైతన్య దివిటీలను అందించింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించటానికి ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ‘విశాలాంధ్ర’సునాయాసన మార్గంగా భావించారు. విశాలాంధ్ర వస్తే ఫ్యూడల్ వ్యవస్థ పోతుందన్న భావనతో వాళ్లు ఒప్పుకున్నారు. మొత్తం ఆలోచనాపరులు అలాగే ఆలోచించారు. విశాలాంధ్ర వస్తే ఏం జరుగుతుందని ఆశించారు. అందుకు భిన్నంగా వాతావరణం మారింది. తెలంగాణలో పాతదొరలు పోయి ఆధునిక దొరలు ఆవిర్భవించారు. అందువల్లనే తెలంగాణ ఆగ్రహించింది. 1956 నుంచి మూడేళ్లలోనే మారిన పరిస్థితులు చూసిన ప్రజలు 1969 ఉద్యమ అగ్గి అయి భగ్గున మండారు. సమస్త తెలంగాణ ప్రజానీకం విశాలాంధ్ర జెండా వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎత్తుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వల్లనే దీర్ఘయావూతగా రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతూ వచ్చింది.

తెలంగాణ నేల నుంచి పెండ్యాల రాఘవరావులాంటి ఉన్నతులు ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. భీమిడ్డి నర్సింహాడ్డి, మగ్ధూం, రావి నారాయణడ్డి, ఆరుట్ల రాంచంవూదాడ్డి, నర్రా రాఘవడ్డి, ఉప్పల మనుసూరులాంటి వాళ్లు శాసనసభ్యులుగా వచ్చారు. ఎమ్మెల్యేగా పనిచేసి కూడా చెప్పులు కుట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ చరివూతలో ఉన్నతస్థానాలను అలంకరించిన ఉప్పల మనుసూరులాంటి మహానీయులు, ధర్మభిక్షం లాంటి ప్రజల మనుషులు పార్లమెంటు, శాసనసభ్యులుగా ఎంపికవుతూ వచ్చారు. ప్రజల హృదయాలను ఆవిష్కరించిన జననేతలే ఇక్కడ ప్రజావూపతినిధులుగా ఎన్నికవుతూ వచ్చారు.

ఇద్దరు అన్నదమ్ములు కాళోజీ రామేశ్వరావును, కాళోజీ నారాయణరావులను విడిగా చూడలేం. కాళోజీ ప్రతిష్ఠలో రామేశ్వరరావు కృషి ఉంది. న్యాయవాది తాండ్ర వెంకవూటామ దగ్గర కాళోజీ ప్రాక్టీసు చేశారు. తమతో విభేదించే వారిని కూడా అక్కన చేర్చుకునే మనస్తత్త్వం తెలంగాణ ప్రజలకుంది. నాందేడ్కు చెందిన బి.టి. దేశ్పాండేను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణారావును చెన్నూరు ఎమ్మెల్యేగా తెలంగాణ నేల ఆలింగనం చేసుకుంది. తెలంగాణ ప్రాంతం వారికి ప్రాంతీయ భేదాలు లేవు. ఇక్కడ ఇతర ప్రాంతాలవాళ్లు ఎంపీ లు, ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణవాళ్లను ఎవరినైనా ప్రజావూపతినిధులుగా ఎన్నుకున్నారా? తెలంగాణ ప్రజలకు ప్రాంతీయతత్త్వం ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవి. ఇది తెలంగాణపై మార్కెట్ సమాజం చేస్తున్న కుట్రలుగా భావించాలి. ప్రాంతీయతత్త్వంలేని విశ్వనరులు తెలంగాణ ప్రజలు.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)