అధిక ఆశ్వయుజ (పురుషోత్తమ) మాసం ప్రారంభం (18 సెప్టెంబరు 2020 నుండి 16 అక్టోబరు 2020
అధిక మాసం : పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు.
ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. ధర్మ సింధువు ననుసరించి అధిక మాసంలో ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనము, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు. ముహూర్తాలతో ప్రమేయం లేని నిత్యం చేసే పూజ పునస్కారాలు యధావిధిగా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు తప్పని సరిగాచేయాలి. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు, ముఖ్యమైన దైవకార్యాలు చేయకూడదు, జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ ఎక్కువచేస్తే మంచిది. మరణ సంబంధమైన క్రతువులు, అంటే మాసికం, ఆబ్దికం మొదలైనవి, అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది. అధికమాసంలో వచ్చే మహాలయ పక్షాలు పితృకర్మలకు విశిష్టమైనవిగా చెబుతారు.
వివరణ : సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు …. మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు…… రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.
అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు….. ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.
క్షయ మాసము :- సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది. కానీ దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం. మరొక విధంగా చెప్పాలంటే అమావాస్య నుండి అమావాస్య వరకుగల సమయంలోపల, సూర్యుడు రెండు రాశులు దాటుతాడు. ఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి సంభవిస్తుంటుంది. వెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ జరుగుతుంది. దీనిని క్షయ మాసం అని పిలుస్తారు.
1823 లో వచ్చిన స్వభాను నామ సంవత్సరం తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 లో వచ్చిన క్రోధి నామ సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964 తరువాత మళ్ళీ కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 లో రుధిరోద్గారి నామ సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించింది. ఇక మనెవ్వరి జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము. ఎందుకంటే తరువాయి క్షయ మాసం సంభవించబోయేది 141 ఏళ్ళ తరువాత 2124 లోని తారణ నామ సంవత్సరంలోనే.
ఈ శతాబ్ధపు అధిక మాసాలు
సంవత్సరము మాసము
2001 వృష – ఆశ్వీయుజ మాసము
2004 తారణ – శ్రావణ మాసము
2007 సర్వజిత్తు – జ్యేష్ట మాసము
2010 వికృతి – వైశాఖ మాసము
2012 నందన – భాద్రపద మాసము
2015 మన్మథ – ఆషాడ మాసము
2018 విలంబి – జ్యేష్ట మాసము
2020 శార్వరి – ఆశ్వీయుజ మాసము
2023 శోభకృతు – శ్రావణ మాసము
2026 పరాభవ – జ్యేష్ట మాసము
2029 సాధారణ – చైత్ర మాసము
2031 విరోధికృతు – భాద్రపద మాసము
2034 ఆనంద – ఆషాడ మాసము
2037 పింగళ – జ్యేష్ట మాసము
2039 సిధ్ధార్థి – ఆశ్వీయుజ మాసము
2042 దుందుభి – శ్రావణ మాసము
2045 క్రోధన – జ్యేష్ట మాసము
2048 శుక్ల – చైత్ర మాసము
2050 ప్రమోదూత – భాద్రపద మాసము
2053 శ్రీముఖ – ఆషాడ మాసము
2056 ధాత – వైశాఖ మాసము
2058 బహుధాన్య – ఆశ్వీయుజ మాసము
2061 వృష – శ్రావణ మాసము
2064 తారణ – జ్యేష్ట మాసము
2067 సర్వధారి – చైత్ర మాసము
2069 విరోధి – శ్రావణ మాసము
2072 నందన – ఆషాడ మాసము
2075 మన్మథ – వైశాఖ మాసము
2077 హేవిలంబి – ఆశ్వీయుజ మాసము
2080 శార్వరి – శ్రావణ మాసము
2083 శోభకృతు – జ్యేష్ట మాసము
2086 ప్లవంగ – చైత్ర మాసము
2088 కీలక – శ్రావణ మాసము
2091 విరోధికృతు – ఆషాడ మాసము
2094 ఆనంద – వైశాఖ మాసము
2096 నల – భాద్రపద మాసము
2099 సిధ్ధార్థి – శ్రావణ మాసము
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా ||
- వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)