Categories
Vipra Foundation

సెప్టెంబర్ 17 – తెలంగాణా విమోచన దినం

ఒక వాస్తవం.. కానీ అనే చరిత్రలు. ప్రపంచంలో ఏ ప్రాంతానికీ ఈ పరిస్థితి ఉండదేమో.. సరిగ్గా ఇదే రోజున అంటే 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ స్టేట్ అంతరించింది పోయింది.. ఇది వాస్తవం.

                1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారత దేశ మంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది.. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్నహైదరాబాద్ నవాబు అసఫ్ జాహీ వంశస్తుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు.. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు.. కానీ సంస్థానంలోని మెజారిటీ ప్రజలు తాము భారత దేశంలో కలవాలని కోరుకున్నారు..

ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది.. ఒకవైపు దేశ్ ముఖ్, జాగీర్దార్, దొరల దాష్టీకం, వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు (నేటి ఎంఐఎం పూర్వరూపం) చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలవతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని గురేస్తానని విర్ర వీగాడు..

ఇలాంటి పరిస్థితితో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి.. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్.. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది.. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు.. ఐదు రోజుల ప్రతి ఘటన తర్వాత నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు.. కానీ కమ్యూనిస్టులు మాత్రం తమ సాయుధ పోరాటాన్ని మరి కొంత కాలం కొనసాగించారు..

ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్న వాస్తవ చరిత్ర.. కానీ రకరకాల భావజాలాల నేపథ్యంలో ఈ చరిత్రకు ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతారు.. ఇది హైదరాబాద్ పై భారత్ దురాక్రమణ అని, భారత సైన్యాలు ముస్లింలను హింసించాయని, మరి కొంత కాలం సాగి ఉంటే కమ్యూనిస్టుల సాయుధ పోరాటం విజయవంతం అయ్యేదని.. కొందరి వాదన.. దురదృష్టవశాత్తు హైదరాబాద్ పోరాట గాధ చరిత్ర పుటలకు ఎక్కలేదు.. మన పాఠ్య గ్రంధాలకు ఎక్కకపోవడం వల్ల గత రెండు తరాలకు అవగాహన ఈ చరిత్ర తెలిసే అవకాశం లేకుండాపోయింది.. హైదరాబాద్ విమోచనం అన్నా, తెలంగాణ విమోచనం అన్నా ఒకటే.. విమోచనం, విముక్తి అనే పదాల్లో పెద్దగా తేడా లేదు.. దీన్ని భూతద్దంలో శోధించాల్సిన అవసరం లేదు..

హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది 1948 సెప్టెంబర్ 17న.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడూ ఉత్సవాలు నిర్వహించిన పాపాన పోలేదు.. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత బొంబాయి(మహారాష్ట్ర), మైసూర్(కర్ణాటక) రాష్ట్రాల్లో కలిసిపోయిన పాత హైదరాబాద్ సంస్థాన భూభాగాలైన మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తున్నాయి.. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భూభాగమైన తెలంగాణలో మాత్రం ఇక్కడి సర్కారు వేడుకలు జరిపేందుకు మొదటి నుండీ జంకుతూ వచ్చింది.. దీనికి కారణం ముస్లింలు నొచ్చుకుంటారనే భయమట.. వాస్తవానికి ఎందరో ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.. షోయబుల్లాఖాన్, ముక్దుం మొయినుద్దీన్, షేక్ బందగీ.. వీరంతా ఎవరు ముస్లింలు కాదా? హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల సహజంగానే వారు బాధితులు అనే కోణంలో దీన్ని అర్థం చేసుకోవల్సి ఉంది..

1947 ఆగస్టు 15కి ఎంత ప్రాధాన్యత ఉందో, 1948 సెప్టెంబర్ 17కీ అంతే ప్రాధాన్యత ఉంది.. ఈ రెండు కూడా స్వాతంత్ర్య దినోత్సవాలే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ స్వాతంత్ర్యం పొందిన సందర్భాన్ని గౌరవించకపోవడం కూడా తెలంగాణ సమస్య మూలాల్లో ఒకటి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.. ఇప్పటికైనా సంకుచిత భావాలను వదిలేసి ఈ రోజును తెలుగువారంతా గౌరవించి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)