Categories
Vipra Foundation

మహాలయ అమావాస్య (పెత్రమావాస్య)

    మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’  నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది.

        శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.

       మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.

   ‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)